ఎమ్మెల్యేగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం
హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నికల్లో గెలుపొందిన బీజేపీ నేత రఘునందన్ రావు బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. స్పీకర్ ఛాంబర్‌లో మధ్యాహ్నం ఒంటి గంటకు అతికొద్ది మంది సమక్షంలో దుబ్బాక శాసనసభ సభ్యుడిగా రఘునందన్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. రఘునందన్ చేత అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, బీజేపీ నేతలు, ఎమ్మెల్సీ రామచందర్ రావు, ఎమ్మెల్యే రాజసింగ్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు.. దుబ్బాక ఎన్నికల ఫలితం ఒక రెఫరెండంగా భావిస్తున్నామన్నారు.. దుబ్బాక గడ్డ మీద పోలీసులను ఎదుర్కొన్నాం .. సెర్చ్ నోటీసులు ఇవ్వకుండా ఇళ్లల్లో సోదాలు చేస్తారా…? అని ప్రశ్నించారు. దీనిపై పోలీసు అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేసిన ఆయన.. చట్టం తమ చుట్టం అని చట్ట వ్యతిరేక కార్యక్రమాలను పోలీసు అధికారులు చేస్తున్నారని మండిపడ్డారు.. పోలీసులను ప్రజలు కొడితే గదే 324 కేసు మాత్రమే ఉంటుందని వ్యాఖ్యానించిన రఘునందన్… నా పంచాయతీ పోలీసులతో కాదు.. పోలీసు కమిషనర్‌తో మాత్రమే అన్నారు. మరో మూడేళ్లు కేసీఆర్ అధికారంలో ఉంటారని తెలిసి కూడా దుబ్బాక ప్రజలు నాకు ఓటు వేశారన్న బీజేపీ ఎమ్మెల్యే.. గ్రేటర్ పరిధిలో కూడా బీజేపీ కి ఓటు వేసి ఆశీర్వదించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.
కాగా నవంబర్ 10న దుబ్బాక ఉప ఎన్నికల ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. ఈ ఉపఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య హోరా హోరి పోరు సాగింది. మొత్తం 23 రౌండ్లలో సాగిన దుబ్బాక లెక్కింపులో రఘనందన్‌రావుకు 62, 772 ఓట్లు రాగా.. సోలిపేట సుజాతకు 61, 302 ఓట్లు వచ్చాయి. దీంతో బీజేపీ అభ్యర్థి రఘనందన్‌రావు మొదటి సారిగా అసెంబ్లీలో అడుగు పెట్టనున్నాడు. అత్యల్ప ఓట్ల మెజార్టీతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు.