ఎస్పీ బాలు కన్నుమూత

చెన్నై : ఎన్నో వేల సినీ గీతాలను ఆలపించిన అద్భుత గానగంధర్వుడు అస్తమించారు. తీయ తీయని రాగాలతో.. తేనలూరించే తెలుగు పాటలను పాడిన ఎస్పీ బాలు ఇక లేరు. గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (74) కన్నుమూశారు. గురువారం రాత్రి నుంచి శ్వాస తీసుకోవడానికి తీవ్రంగా ఇబ్బంది పడ్డ ఆయన శుక్రవారం మధ్యాహ్నం వెంటిలేటర్‌పైనే తుది శ్వాస విడిచారు. త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో వస్తాడనుకున్న అభిమానులను శోకసంద్రంలో ముంచేసి తిరిగి రాని లోకాలకు బాలు వెళ్లిపోయారు. బాలు 1.04 నిమిషాలకు మరణించినట్లు ఆయన కుమారుడు చరణ్ మీడియా ముందు స్వయంగా ధృవీకరించారు. చెన్నైలోని మౌంట్‌రోడ్డులోని సత్యం థియేటర్ వద్దకు బాలసుబ్రహ్మణ్యం భౌతికకాయం తరలించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సందర్శకుల కోసం చెన్నై అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎస్పీ బాలుకు కరోనా పాజిటివ్ అని తేలడంతో ఆగస్టు 5న చెన్నైలోని ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు. 50 రోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స తీసుకుంటున్న ఆయన మృతి చెందడం పట్ల దక్షిణాది చిత్ర పరిశ్రమ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో పలువురు సెలబ్రిటీలు ఆయనకు అశ్రు నివాళులు అర్పిస్తున్నారు.
ఎస్పీ బాలసుబ్రమణ్యం 1946 జూన్ 4న నెల్లూరులోని కోనేటమ్మపేటలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం. ఆయన తండ్రి పేరు శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి. తల్లి పేరు శకుంతలమ్మ. బాలు జీవిత భాగస్వామి పేరు సావిత్రి. బాలు పిల్లల పేర్లు చరణ్, పల్లవి. కాగా ఆయన శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1966) చిత్రంలోతొలిసారి పాట పాడారు. శంకరాభరణం, సాగరసంగమం లాంటి తెలుగు చిత్రాలే కాకుండా ‘ఏక్ దుజే కేలియే’ లాంటి హిందీ చిత్రాలకు బాలు పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. నాలుగు దశాబ్దాలకు పైగా సాగినసినీ ప్రస్థానంలో నలభై వేల పైచిలుకు పాటలు పాడి గిన్నిస్ రికార్డును సాధించారు. నేపథ్య గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా అలరించిన బాలసుబ్రహ్యణ్యం తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో సుమారు 40 వేలకుపైగా పాటలు పాడాడు. కెరీర్ ప్రారంభంలో తెలుగు, తమిళ భాషలలో ఎక్కువగా పాటలు పాడిన ఆయన తర్వాత దాదాపు 14 భాషలలో తన గాత్రంతో అలరించారు.
తమ్ముడు కమల్ హాసన్‌కు చేతిలో సినిమాలు లేని సమయంలో ఆయన మీదున్న ప్రేమతో బాలు నిర్మాతగా మారారు. అలా తీసిని ‘శుభ సంకల్పం’ ఎన్నో అవార్డులను తెచ్చి పెట్టింది. కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, జెమిని గణేషన్ వంటి పలువురు హీరోలకు గాత్రదానం కూడా చేశారు. గాన మాధుర్యంతోనే కాదు, నటనతోనూ బాలు ప్రేక్షకులను కట్టిపడేశారు. 1969లో పెళ్ళంటే నూరేళ్ళ పంట అనే చిత్రంలో మొదటిసారి నటుడిగా కనిపించారు.
ముఖ్యంగా బాలు సినీ జీవితం ‘శంకరాభరణం’ సినిమాతో పూర్తిగా మారిపోయింది. అప్పటివరకు మాస్ గీతాలకే పరిమితం అయిన బాలు.. ఈ సినిమాలో క్లాసికల్ పాటలను సైతం అద్భుతంగా పాడగలనని విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. ఈ చిత్రానికి బాలు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమ గాయకుడిగా అవార్డు అందుకున్నాడు.
ఎస్పీ బాలు సుదీర్ఘ ప్రస్థానంలో 6 జాతీయ పురస్కారాలు, 6 ఫిల్మ్ ఫేర్ దక్షిణాది పురస్కారాలు, ఒక ఫిల్మ్ ఫేర్ పురస్కారం అందుకున్నాడు. 1979 లో వచ్చిన సంగీత ప్రధానమైన శంకరాభరణం చిత్రానికి ఆయనకు జాతీయ పురస్కారం లభించింది. రెండు సంవత్సరాల తర్వాత ఆయనకు 1981 లో బాలీవుడ్ లో ప్రవేశించి ఏక్ దూజే కేలియే చిత్రానికి గాను రెండోసారి పురస్కారాన్ని అందుకున్నాడు. తర్వాత సాగర సంగమం, రుద్రవీణ చిత్రాలకు జాతీయ పురస్కారాలు అందుకున్నాడు. 25 సార్లు ఉత్తమ గాయకుడిగా, ఉత్తమ సంగీత దర్శకుడిగా, ఉత్తమ డబ్బింగ్ ఆర్టిస్టుగా, ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారాలు అందుకున్నాడు. భారతదేశ కేంద్రప్రభుత్వం నుండి 2001 లో పద్మశ్రీ పురస్కారాన్ని, 2011 లో పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు బాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 25 సార్లు వివిధ విభాగాల్లో నంది పురస్కారం అందుకున్నాడు.