ఏలూరులో డ్యూటీలో ఉన్న కానిస్టేబుల్‌కు అస్వస్థత
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లాలోని ఏలూరులో గత రెండు రోజుల నుండి కలవరపెడుతున్న అంతుచిక్కని వ్యాధితో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఆదివారం ఒకరు మృతి చెందగా…తాజాగా ఒక కానిస్టేబుల్ అస్వస్థతకు గురయ్యారు. ఈ ఆకస్మిక జబ్బుతో బాధితులైన వారిని పరామర్శించేందుకు ముఖ్యమంత్రి ఏలూరు నగరానికి వచ్చారు. ఈ పర్యటన నేపథ్యంలో బందోబస్తు నిర్వహిస్తున్న మూడో పట్టణ కానిస్టేబుల్ పుట్ట కిరణ్ ఒక్కసారిగా తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో తక్షణమే అప్రమత్తమైన తోటి సిబ్బంది ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అస్వస్థతకు గురైన వారిని పరామర్శించనున్న సీఎం జగన్
ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చేరుకున్నారు. హెలీప్యాడ్ నుంచి నేరుగా ఏలూరు ప్రభుత్వాసుపత్రికి బయల్దేరారు. అస్వస్థతకు గురై ఏలూరు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సీఎం పరామర్శించనున్నారు. సీఎం జగన్ వెంట మంత్రి పేర్ని నాని, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. బాధితుల పరామర్శ అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం దేవరపల్లికి చేరుకొని గోపాలపురం ఎమ్మెల్యే తల్లారి వెంకట్రావు కుమార్తె వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ హాజరుకానున్నారు.