కుమ్రంభీం జిల్లాలో పెద్దపులి కలకలం

పెంచికల్‌పేట్‌: కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో పెద్ద‌పులి సంచారం క‌ల‌క‌లం రేపుతోంది. జిల్లాలోని పెంచికల్‌పేట్‌ మండలం అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగులో గురువారం పెద్దపులి కనిపించింది. వాగు పరీవాహక ప్రాంతంలోని చేలల్లో పత్తి ఏరుతున్న కూలీలకు సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో పెద్దవాగులో పులి నీరు తాగుతూ కనిపించింది. ఓ యువకుడు తన సెల్‌ఫోన్‌లో వీడియో తీసి సోషల్‌ మీడియాలో పెట్టగా, వైరల్‌ అయ్యింది. విషయం తెలుసుకున్న అటవీ అధికారులు ప్రత్యేక సిబ్బందితో కలిసి పులి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. కేకలు, పెద్దగా శబ్దాలు చేయడంతో అది అక్కడి నుంచి వెళ్లిపోయింది. గతంలో రేంజ్‌ పరిధిలో పలుమార్లు రోడ్లపై సంచరిస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసిన సందర్భాలున్నాయి. పలుమార్లు పశువులపై దాడి చేసిన ఘటనలు ఉన్నాయి. అగర్‌గూడ సమీపంలోని పెద్దవాగు ప్రాంతంలో పులి సంచరించిన విషయం వాస్తవమేనని ఎఫ్‌ఆర్వో తెలిపారు. పులి సంచారం వార్త‌తో ఆ ప్రాంత ప్రజ‌లంతా భ‌యాందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Leave A Reply

Your email address will not be published.