కెసిఆర్ సిద్దిపేట పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు

సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలో ఈ నెల 10వ తేదీన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సిఎం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సిద్దిపేట పట్టణ శివారులోని నర్సాపురంలో ప్రభుత్వం పేదలకోసం రూ.163 కోట్లతో నిర్మించిన 2,460 డబుల్ బెడ్రూం ఇండ్ల సముదాయాన్ని, సిద్దిపేటలో రూ.135 కోట్లతో నిర్మించిన ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రారంభించనున్నారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా రూ.225 కోట్లతో నిర్మించనున్న 960 పడకల దవాఖానకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలోని చింతల్‌చెరువు వద్ద రూ.278 కోట్లతో నిర్మించిన భూగర్భ డ్రైనేజీ వ్యవస్థను ప్రారంభించనున్నారు. రంగనాయకసాగర్ జలాశయం మధ్య రూ.8 కోట్లతో నిర్మించిన అతిథి గృహాన్ని, మిట్టపల్లి రైతువేదికను, విపంచి ఆడిటోరియాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించి, కోమటిచెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించిన అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జరిగే బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ వెంకట్రామరెడ్డి, పోలీస్ కమిషనర్ జోయల్ డేవిస్ తదితరులు ఉన్నారు.