కొత్త‌పెళ్లికొడుకు కొంప ముంచిన భౌతిక దూరం..!

భౌతిక దూరం పాటించిన కొత్త పెళ్లికొడుకు.. అపార్థం చేసుకున్న భార్య!

భోపాల్: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌జ‌ల బ‌తుకుల‌ను తారుమారు చేస్తోంది. ఈ భూతం ప్ర‌త్య‌క్షంగాను, ప‌రోక్షంగానూ ప్ర‌జ‌ల‌ను తీవ్ర ఇబ్బందుల‌కు గురిచేస్తోంది. ఈ మ‌ధ్య కాలంలో భార‌త్‌లో కేసులు త‌గ్గుతున్న‌ప్ప‌టికీ.. ఆ భ‌యం నుంచి ప్ర‌జ‌లు ఇంకా బ‌య‌ట‌ప‌డ‌లేక‌పోతున్నారు. దూరం.. దూరం.. అంటూ ప్ర‌జ‌ల‌ను ప‌లుమార్లు ప్రభుత్వాలు, ప్ర‌ముఖుల మొద‌లు అంద‌రూ అంటూండ‌టంతో ప్ర‌జ‌ల మ‌ధ్య సామాజిక దూరంతో పాటు కుటుంబాల్లోకూడా ఈ దూరం పెరుగుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. చాలామంది ఈ ‘కరోనాఫోబియా’ బారినపడి సమస్యలు ఎదుర్కొంటున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న ఓ యువకుడు భార్య వద్ద భౌతిక దూరం పాటిస్తుండడంతో అనుమానించిన భార్య అతడు నపుంసకుడని భావించి, విడిచిపెట్టి వెళ్లిపోయింది. మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో జరిగిందీ ఘటన.

ఈ ఏడాది జూన్ 29న వివాహం చేసుకున్న అతడు కరోనా భయంతో పెళ్లి నాటి నుంచి భార్య వద్ద భౌతిక దూరం పాటిస్తున్నాడు. నెలలు గడుస్తున్నా అతడు దగ్గరికి రాకపోవడంతో అనుమానించిన భార్య అతడు సంసారానికి పనికిరాకపోవడం వల్లే తనతో దూరంగా ఉంటున్నాడని అనుమానించింది. దీంతో అతడిని విడిచిపెట్టి తల్లిదండ్రుల వద్దకు వెళ్లిపోయింది. ఈ నెల 2న ఆమెన్యాయసేవా సంస్థను ఆశ్రయించి.. తన భర్త సంసారానికి పనికిరాడని, నపుంశకుడు కావడంతో తనతో శారీరక సంబంధం పెట్టుకునేందుకు ఆసక్తి చూపడం లేదని తెలిపింది. కాబట్టి అతడి నుంచి తనకు భరణం ఇప్పించాలని కోరింది. తనతో మాట్లాడేటప్పుడు కూడా భౌతిక దూరం పాటిస్తున్నాడని పేర్కొంది. అంతేకాదు, తన అత్తమామలు కూడా తనను హింసిస్తున్నారని ఆరోపించింది.

ఆమె ఫిర్యాదుతో స్పందించిన అధికారులు ఆమె భర్తకు కౌన్సెలింగ్ ఇవ్వాలని నిర్ణయించి అతడిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా అతడు చెప్పింది విని విస్తుపోయారు. కరోనా భయం కారణంగానే భార్యకు దూరంగా ఉంటున్నానని చెప్పాడు. వివాహం జరిగిన వెంటనే తన భార్య కుటుంబ సభ్యులకు కరోనా వైరస్ సోకింది, ఆ భయంతోనే ఆమెకు దూరంగా ఉంటున్నాను తప్పితే మరేమీ లేదని చెప్పడంతో కౌన్సెలర్లు ఆశ్చర్యపోయారు. తనకు వైరస్ సోకుతుందన్న భయం అతడిలో పాతుకుపోయిందని, తన భార్యలో రోగనిరోధకశక్తి అధికంగా ఉండడంతో ఆమెలో లక్షణాలు బయటపడడం లేదని అతడు విశ్వసిస్తున్నట్టు చెప్పాడని కౌన్సెలర్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.