గడ్డమే అడ్డం.. భర్త గడ్డం తీయనన్నందుకు.. మరిదితో వెళ్లిపోయిన వదిన

మేరట్ (ఉత్తరప్రదేశ్), (CLiC2NEWA): కొందరి నిర్వాకం మూలంగా అనుబంధాల మీదనే కొత్త అనుమానాల్ని రేకెత్తిస్తున్నాయి. యుపిలోని మీరట్‌లో ఇలాంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. తన భర్త గడ్డం నచ్చకపోవడంతో.. గడ్డం లేకుండా ఉన్న మరిదితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయింది వదిన. ఈ ఘటన మీరట్ లోని లిసాడి గేట్ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…
ఆరు నెలల కిందట మౌలానా షకీర్‌కు ఆర్షి అనే యువతితో వివాహం జరిగింది. ఇంటర్ వరకు చదువుకొన్న ఆర్షి డిగ్రీ చదువును కొనసాగిస్తోంది. పెళ్లయిన నాటి నుంచి భర్త గడ్డంతో ఉండటం ఇష్టంలేదని పలుమార్లు చెబుతూ వస్తోంది. కానీ అర్షి మాటతో ఏకీభవించని భర్త ఎట్టిపరిస్థితుల్లోనూ గడ్డం తీసేది లేదని తేల్చి చెప్పాడు. దాంతో గడ్డం విషయమై ఇంటో పలుమార్లు గొడవలు కూడా జరిగాయి.
కాగా భర్త షకీర్ ఉదయం పనిలోకి వెళ్లిపోయాక ఇంట్లో అతని తల్లి, సోదరుడు ఉండేవారు. దాంతో క్లీన్ షేవ్‌తో కనిపించే షకీర్ సోదరుడు ఆమెకు చేరువై.. ఇద్దరు కలిసి ఇంట్లోనుంచి వెళ్లిపోయారు.
దాంతో కలత చెందిన షకీర్ పోలీసులను ఆశ్రయించారు. ఇద్దరు వ్యక్తులు తప్పిపోయినట్లుగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మేరట్ ఎస్పీ ఆయుష్ విక్రమ్ సింగ్ మీడియాకు తెలిపారు.