గొప్ప మనసు చాటుకున్న వేగుళ్ళ

మండపేట: లాక్‌డౌన్ సమయంలో… వలస కూలీలకు, కార్మికులకు ఎంతో సాయం చేసి ఉదారతను చాటుకుంటున్నాడు. గుప్త దానాలు చేయడంలో తండ్రిని మించిన తనయుడుగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఎంతో పేరు తెచ్చుకున్నారు. గతంలో మండపేటలో ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు అప్పటి మున్సిపల్ చైర్మన్ గా ఉన్న వేగుళ్ళ వీర్రాజు ప్రజల దీనావస్థను చూసి తల్లడిల్లిపోయి ఎందరికో సాయం చేయడం జరిగిందని ఈ నాటికీ వయోవృద్ధులు వీర్రాజు గొప్పదనాన్ని చాటి చెబుతూ ఉంటారు. ఆయన ఆశయాలను అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు నియోజకవర్గం లో కరోనా బాధితులను ఆదుకుంటున్నారు. భారత దేశంలో ఏ ప్రజా ప్రతినిధి చేయని విధంగా ఆయన తన నియోజకవర్గంలోని ప్రజలను ఆదుకోవడం రాష్ట్రంలో పలువురిని ఆశ్చర్యచకితులను చేస్తోంది.
కరోనా బాధితులకు ఆహారమే సరైన మందు అని భావించిన ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు తన దాతృత్వాన్ని ప్రపంచానికి చాటిచెప్పారు. కరోనా బాధితులకు ప్రతి రోజు లక్షలాది రూపాయలు విలువచేసే పౌష్టికాహార కిట్లను ఆయన నియోజకవర్గంలో తన కార్యకర్తల ద్వారా పార్టీలతో సంబంధం లేకుండా అందజేయడం విశేషం. వీటి కోసం 50 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నిరంతరం శ్రమించడం విశేషం. ఈ విధంగా చేయడంతో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా అభినందించారు. చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ వితరణ ఆయన చేయడం చాలా అరుదైన విషయం. గత కొన్ని నెలలుగా ఆయన కరోనా బాధితులకు ఈ విధంగా పౌష్టికాహార కిట్లను పంపిణీ చేస్తున్నారు. వీటి కోసం సుశిక్షితులైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంపిక చేసి ప్రతి గ్రామంలో పౌష్టికాహారాన్ని పంపిణీ చేస్తున్నారు. వేగుళ్ళ వితరణను నియోజకవర్గ ప్రజలు వేనోళ్ళ పొగుడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో పౌష్టిక ఆహార కిట్లను గురువారం కపిలేశ్వరపురం మండలం లో 29 మందికి అందజేశారు.