`గ్రేటర్`పోరు: సీనియర్లతో కేటీఆర్ సమాలోచనలు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలవ్వడంతో రాజధానిల్లో ఒక్కసారిగా రాజకీయం వేడెక్కింది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది అధికార టీఆర్ఎస్. ఇప్పటికే గ్రేటర్లోని 150 డివిజన్లకు అభ్యర్థుల పేర్లు ఖరారైనట్టు తెలుస్తుండగా… రేపో, మాపో.. ఒకే జాబితాలో అందరి పేర్లను ప్రకటించేందుకు సిద్ధం అవుతున్నారు.. ఇక, ఈ ఎన్నికలకు అన్ని విధాలుగా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవుతోంది టీఆర్ఎస్.. అందులో భాగంగా పార్టీ ఇంఛార్జిలు, సీనియర్ నేతలతో ప్రత్యేకంగా సమాలోచనలు జరిపారు మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. ఈ సమావేశంలో.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేసినట్టుగా తెలుస్తోంది… సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపికపై సీనియర్లతో చర్చించారు కేటీఆర్. ఇక, గ్రేటర్ ఎన్నికల కోసం పది మంది సీనియర్ నాయకులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 150 డివిజన్లలో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది.. ఇప్పటికే అభ్యర్థులపై ఓ నిర్ణయానికి వచ్చినా.. సర్వేల ఆధారంగా కొత్తవారికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఓవైపు సిట్టింగ్ కార్పొరేటర్లు.. మరోవైపు ఆశావహులు టీఆర్ఎస్ జాబితా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.