టిఆర్ఎస్కు, ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా

హైదరాబాద్(CLiC2NEWS): తెలంగాణ రాష్ట్ర సమితితో ఉన్న 19 ఏళ్ల అనుబంధాన్ని మాజీ మంత్రి ఈటల రాజేందర్ తెంచుకున్నారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని స్పష్టంచేశారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ రాజీనామా చేశారు. టీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు కొద్దిసేపటి క్రితమే ప్రకటించారు. హైదరాబాద్ దగ్గరలోని శామీర్‌పేట నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఉరిశిక్షపడిన ఖైదీకి కూడా చివరి కోరిక ఏంటని అడుగుతారని, కానీ, ఏం జరిగిందో తెలుసుకోకుండా చర్యలు తీసుకున్నారని, రాత్రికి రాత్రే విచారణ చేసి బర్త్‌రఫ్ చేశారని ఈటల ఆరోపించారు. 19 ఏళ్లుగా టీఆర్ఎస్లో ఉన్నానని, ఓ అనామకుడు లేఖరాస్తే రాత్రికి రాత్రే మంత్రిమీద విచారణ చేస్తారా? అని ప్రశ్నించారు. తనపై జరుగుతున్న దాడి, కుట్రలపై ప్రజలు ఆవేదన చెందుతున్నారని ఈటల పేర్కొన్నారు. కేసీఆర్‌ను కలిసేందుకు రెండుసార్లు ప్రయత్నించనని, కానీ, అవకాశం ఇవ్వలేదని ఈటల తెలిపారు.
“అన్ని కుల సంఘాలకు హక్కులు లేకుండా చేశారు. ఇందిరా పార్కు వద్ద ధర్నా చౌక్‌ను ఎత్తేసిన చరిత్ర వీరిదే. రైతు బంధు ఆదాయపన్ను చెల్లించే వారికి ఇవ్వొద్దని .. వ్యవసాయం చేయని వారికి రైతుబంధు ఇస్తే ఉపయోగం ఉండదని చెప్పాను. పొలం సాగు చేస్తున్న రైతులకు రైతు బంధు ఇస్తే బాగుంటుందని చెప్పా. రాష్ట్రంలో ధాన్యం కొనేస్థాయి రైస్ మిల్లర్లకు లేదు.. రాదు కూడా. ఐకెపి కేంద్రాలు ఉంటాయి.. ధాన్యం కొంటారని చెప్పా… ఇదేమైనా తప్పా..?
కాంగ్రెస్ హయాంలో నేను తెచ్చుకున్న గోదాములు మూసివేయించారు. 119 మంది ఎమ్మెల్యేలు. 17 మంది మంత్రులపై నమ్మకం లేకపోతే 4 కోట్ల ప్రజలపై నమ్మకం ఉంటుందా? మెజారిటీ ఉన్నప్పటికీ టిడిపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేశారు. 90 మంది ఎమ్మెల్యేలు ఉన్నా.. ఎందుకు కొన్నారు..?
నా నెత్తిన కొట్టే ప్రయత్నం చేశారు.. తప్పకుండా మీ నెత్తిని కొట్టేవారు ఉంటారు. తెలంగాణలో నేను సంపాదించుకున్న పేరును దెబ్బతీసే ప్రయత్నం చేశారు. హుజూరాబాద్ ప్రజలు డబ్బు సంచులను, కుట్రలు, కుతంత్రాలను బొందపెడతారు.“ అని ఈటల రాజేందర్ అన్నారు.