టివిజి: దసరా ఉత్సవాల్లో మైసూర్ తరువాత స్థానం పంగిడిగూడెం

భారత దేశంలో దసరా ఉత్సవాలు ఎంతో కన్నుల పండుగగా జరుపుకుంటారు. ప్రాచీన కాలం నుండి మైసూర్ మహారాజా ప్యాలెస్ లో జరిగే ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నాడు విక్టోరియా మహారాణి కూడా లండన్ నుంచి ఈ ఉత్సవాలకు హాజరైన దాఖలాలు ఉన్నాయి.అదే రీతిలో రెండవ స్థానంలో పశ్చిమగోదావరి జిల్లాలో పంగిడిగూడెం సంస్థానం దసరా ఉత్సవాలు చేయడం జరుగుతుంది.
ఈ ఉత్సవాలకు మద్రాస్ ప్రెసిడెన్సీ నుంచి గవర్నర్లు, ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు పంగిడిగూడెం వచ్చే వారు. 1935లో విజయదశమి వేడుకల్లో అప్పటి మద్రాసు ప్రెసిడెన్సీ గవర్నర్ సర్ కూర్మా వెంకట రెడ్డి నాయుడు పంగిడిగూడెం రావడం జరిగింది. ఏనుగులు, సింహాలు, పులులు, వేళ్ళు, జింకలు రకరకాల పక్షులు ఈ వేడుకల్లో పాల్గొనేవి. ప్రతీ దశరాకు తొమ్మిది పులులను బదులు ఇచ్చి వేడుకలు చేసేవారు. భీమడోలు నుంచి పంగిడిగూడెం 5 కిలో మీటర్లు ప్రత్యేక రైలుమార్గం అప్పటి ఈస్ట్ ఇండియా కంపెనీ పంగిడిగూడెం సంస్థానం కోసం వేసారు.
తప్పకచదవండి: పంగిడి గూడెం మహారాజులు
అప్పట్లో మెయిల్ ట్రైన్లో ఒక ప్రత్యేక బోగీ పంగిడిగూడెంలో సంస్థానం ఎదుట ప్రతీ రోజూ ఉండేది.ఈ బోగీలో రకరకాల మాంసం అటవీ ఉత్పత్తులను మద్రాసు గవర్నర్ జనరల్ లార్డ్ ఇరిక్సన్ కు రవాణా అవుతూ ఉండేవి.రాజా బొమ్మ దేవర జగన్నాథరావు నాయుడు,ఆయన తండ్రి భాష్యకార్లు నాయుడు కుటుంబ సభ్యులు ఈ ప్రత్యేక రైలు బోగీలో మద్రాసు వెళ్ళేవారు. ఈ రాజ కుటుంబం ఈస్ట్ ఇండియా కంపెనీ, నిజాం నవాబుల కు అత్యంత సన్నిహితంగా ఉండడంతో ఈ రాచరిక వ్యవస్థ చరిత్ర పుటల్లో చోటు చేసుకోలేదు.రెండో ప్రపంచ యుద్ధకాలంలో బ్రిటిష్ వారు కొత్త గా రైలు మార్గం కోసం భీమడోలు-పంగిడిగూడెం, కాకినాడ-కోటిపల్లి రైలు పట్టాలను పీకి వేశారు. దశరా ఉత్సవాల్లో ప్రతీ ఏడాది తొమ్మిది పులులను పంగిడిగూడెం సంస్థానాధీశులు బలులు ఇవ్వడం వల్ల ఈ సంస్థానాలు 400 సంవత్సరాల కు అంతర్థానం అయ్యాయి.
ఈ సంస్థానంలో పని చేసిన 90 సంవత్సరాల వయోవృద్ధుడు తాతారావు ను నేను 1985లో కలుసుకొని వివరాలు సేకరించాను. నేను అప్పట్లో అమలాపురం ఆంధ్ర జ్యోతి పత్రికకు విలేకరిగా పని చేస్తున్నాను. నేను నా బాల్యం లో అనగా 1975 ప్రాంతాల్లో పెరవలి సర్పంచ్ గా ఉన్న నా పెదతండ్రి బుద్ధన వెంకట స్వామి (పెరవలి మునసబు) నాకు పంగిడిగూడెం సంస్థానం గురించి వివరించారు. వాటిని ఆధారంగా చేసుకుని తాతారావు ను కలుసుకొని హైదరాబాద్ సెంట్రల్ లైబ్రరీ లో జమిందార్స్ ఇన్ ఈస్ట్ ఇండియా అనే పుస్తకం నుండి విషయాలు గ్రహించడం జరిగింది.
-టి.వి.గోవిందరావు