టెస్టు క్రికెట్‌కు సీనియర్ ఆటగాడు డుప్లెసిస్ గుడ్ బై

జోహెన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికా సీనియర్ ఆటగాడు ఫాఫ్ డు ప్లెసిస్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెబుతున్నట్లు బుధవారం ప్రకటించాడు. పరిమిత ఓవర్లతో పాటు, టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అతను పేర్కొన్నాడు. 2012లో అంతర్జాతీయ టెస్టు క్రికెట్‌లో అరంగేట్రం చేసిన 36 ఏళ్ల డు ప్లెసిస్ ప్రొటీస్ తరపున 69 టెస్టు మ్యాచ్‌ల్లో 40 సగటుతో 4,163 పరుగులు సాధించాడు. ఇందులో 10 సెంచరీలు, 21 అర్థసెంచరీలు ఉన్నాయి. దక్షిణాఫ్రికా జట్టుకు అన్ని ఫార్మాట్లలో డు ప్లెసిస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అకస్మాత్తుగా టెస్ట్ క్రికెట్‌కు డుప్లెసిస్ గుడ్‌బై చెబుతూ తీసుకున్న ఈ నిర్ణయం అతడి అభిమానులను షాక్‌కు గురిచేసింది.
డుప్లెసిస్ టెస్టు రిటైర్మెంట్‌పై స్పందించాడు. ‘టెస్టులు ఇక ఆడకూడదనే నిర్ణయంతో నేను క్లియర్‌గా ఉన్నా. టెస్టులకు గుడ్‌బై తర్వాత కొత్త చాప్టర్‌ను మొదలుపెడుతా. పరిమిత ఓవర్లతో పాటు టీ20లపై దృష్టి పెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా 9ఏళ్ల పాటు దక్షిణాఫ్రికా తరపున టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. వచ్చే రెండేళ్లలో ఐసీసీ టీ20 ప్రపంచకప్‌తో పాటు వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పుడు నా ఫోకస్ మొత్తం వాటిపైనే ఉంది. ఇన్నాళ్లు మీరిచ్చిన మద్దతుకు థ్యాంక్యూ ‘అంటూ ముగించాడు.