ఢిల్లీలో మార్కెట్లను మూసివేస్తాం : సీఎం కేజ్రీవాల్

హైదరాబాద్: దేశ రాజధాని హస్తినలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా పెరుగుతున్న విషయం తెలిసిందే. మంగళవారం ఢిల్లీ సిఎం కేజ్రీవాల్ మీడియాతో మాట్లాడుతూ.. కేసుల సంఖ్యను అదుపులో ఉంచాలంటే మార్కెట్లను మూసివేయాలని అభిప్రాయపడ్డారు. కరోనా కేసులు పెరుగుతున్న దృష్ట్యా.. కేంద్ర ప్రభుత్వానికి ఓ వినతి పంపిస్తున్నామని, ఒకవేళ వీలైతే, కొన్ని రోజుల పాటు ఢిల్లీలో మార్కెట్లను మూసివేయనున్నట్లు కేజ్రీ తెలిపారు. కోవిడ్ ఆంక్షలను పాటించని ప్రదేశాలు.. లోకల్ ట్రాన్స్‌మిషన్‌కు సెంటర్లుగా మారుతున్నాయని సీఎం చెప్పారు. ఢిల్లీ హాస్పిటళ్లలో 750 ఐసీయూ మంచాలను పెంచినందుకు కేంద్ర ప్రభుత్వానికి కేజ్రీ థ్యాంక్స్ చెప్పారు. వైరస్‌ను నియంత్రించేందుకు ప్రభుత్వ ఏజెన్సీలన్నీ రెండింతలు పనిచేస్తున్నాయని, కానీ కోవిడ్19 నివారణలో ప్రజలు సరైన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సోషల్ డిస్టాన్సింగ్ కూడా పాటించాలని సీఎం కేజ్రీ కోరారు.
ఢిల్లీలో సోమవారం కొత్తగా 3979 కరోనా వైరస్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఢిల్లీలో వైరస్ కేసుల సంఖ్య 4.89 లక్షలకు చేరుకున్నది. ఇప్పటి వరకు 7713 మంది వైరస్‌తో మరణించారు. నవంబర్ 11న అత్యధికంగా 8593 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.