ఢిల్లీలో లాక్‌డౌన్ మరో వారం పొడిగింపు

న్యూఢిల్లీ(CLiC2NEWS): దేశ రాజధాని ఢిల్లీలో లాక్‌డౌన్ మరో వారం రోజుల పాటు పొడిగించారు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. ఇప్పటికే లాక్‌డౌన్ విధించినా.. కోవిడ్ కంట్రోల్ కావడం లేదు దీంతో మరో వారం రోజుల పాటు లాక్‌డౌన్ ఉంటుంది అంటూ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. ఈసారి ఆంక్షలను మరింత కఠినతరం చేస్తున్నట్లు ప్రకటించారు. మెట్రో సర్వీసులను కూడా రద్దు చేశారు. ఈ నెల 17 ఉదయం 5 గంటల వరకూ లాక్‌డౌన్ విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. కొవిడ్ కేసులు కొద్దిగా తగ్గినా.. మధ్యలో వదిలేయకూడదన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఏప్రిల్‌లో మధ్యలో ఢిల్లీలో పాజిటివిటీ రేటు 35 శాతంగా ఉండగా.. ఇప్పుడది 23 శాతానికి వచ్చింది. ఇది కూడా చాలా ఎక్కువే అని, వ్యాప్తిని మరింత అరికట్టాల్సిందేనని డాక్టర్లు చెబుతున్నారు.
మొదట్లో చాలా చిన్న లాక్‌డౌన్ అని చెప్పి ప్రారంభించిన ముఖ్యమంత్రి కేజ్రీవాల్.. తప్పనిసరి పరిస్థితుల్లో దానిని పొడిగిస్తూ వెళ్తున్నారు. ఢిల్లీ లాక్‌డౌన్ విధించి ఇది నాలుగో వారం. రాష్ట్రంలో వైద్య రంగంలో మౌలిక సదుపాయాలను పెంచుకునేందుకు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నామని కేజ్రీవాల్ వెల్లడించారు. దీంతోపాటు కొన్ని చోట్ల ఆక్సిజన్ బెడ్స్‌ను పెంచినట్లు తెలిపారు. ఢిల్లీలో ఆక్సిజన్ పరిస్థితి మెరుగైందన్నారు. తమకు ఆక్సిజన్ కావాలంటూ ఫోన్ కాల్స్ రావడం లేదని పేర్కొన్నారు. 18-44 సంవత్సరాల వయసు వారికి వ్యాక్సినేషన్ జరుగుతోందని, యువత పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. అదనపు వ్యాక్సిన్ డోసులు మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.