తెలంగాణలో నేటి నుంచి రాత్రి కర్ఫ్యూ

హైదరాబాద్: తెలంగాణలో కరోనా ఉధ్ధృతి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి మే ఒకటో తేదీ ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. రాత్రి 8 గంటలకే కార్యాలయాలు, దుఖాణాలు, హోటళ్లు మూసివేయాలని ప్రభుత్వం ఆదేశలు జారీ చేసింది. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రకటలో పేర్కొంది.
మినహాయింపు
అత్యవసర సేవలు, పెట్రోల్ బంకులు, మెడికల్ షాపులు, డయాగ్నోస్టిక్ సెంటర్లు, ఆస్పత్రులు, ప్రయివేటు సెక్యూరిటీ సర్వీసులు, ఈ-కామర్స్ సేవలు, ఆహార పదార్థాల పంపిణీ, కోల్డ్ స్టోరేజ్‌లు, గోడౌన్లకు మినహాయింపు ఇచ్చారు. విమాన, రైలు, బస్సు ప్రయాణికులకు వ్యాలిడ్ టికెట్లు ఉంటే కర్ఫ్యూ నుంచి మినహాయింపు ఇవ్వనున్నారు. వైద్యం కోసం వెళ్లే గర్భిణులు, రోగులకు కూడా మినహాయింపు ఇచ్చారు. అంతర్రాష్ట్ర రవాణాకు ఎలాంటి పాసులు అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
నిషేధం
పౌరులు బయట తిరగడం, థియేటర్లు, పబ్బులు, క్లబ్బులు, బార్లు, రెస్టారెంట్లు, మద్యం దుకాణాలు, హోటల్స్ రాత్రి 8 గంటల తర్వాత బంద్ కానున్నాయి.
హైకోర్టు ఆదేశాలతో నిర్ణయం
కొవిడ్ నియంత్రణలో ఉదాసీనతపై సోమవారం హైకోర్టు మండిపండింది. 10 రోజుల సమయం ఇచ్చినా ఏ ఒక్క ఆదేశం అమలు చేయలేదని సర్కార్‌ను తప్పు పట్టింది. మీరు చేయకపోతే మేము చేయాల్సి వస్తుందని స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలు.. బార్లు.. సినిమా హాళ్లు.. పెళ్లిళ్లు.. అంత్యక్రియల్లో రద్దీని ఎందుకు తగ్గించలేదని కోర్టు ప్రశించింది. రాత్రిపూట.. వారాంతాల్లో కర్ఫ్యూ వంటి నియంత్రణ చర్యలు ఎందుకు తీసుకోదు? మీరు చర్యలు తీసుకుంటారా? లేక మమ్మల్ని ఆదేశాలివ్వమంటారా? ఈ పనులన్నీ చేయాల్సిన బాధ్యత మీది. మమ్మల్ని ఎందుకు ఇందులోకి లాగుతున్నారు? 48 గంటల్లో నిర్ణయం తీసుకోండి అని హైకోర్టు నిన్న సర్కార్‌ను ఆదేశించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కరోనా నియంత్రణపై కీలక నిర్ణయం తీసుకుంది.