తెలంగాణకు Remdesivir, Oxygen కోటా పెంపు
సిఎం కెసిఆర్‌కు ఫోన్‌లో తెలిపిన కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణ సిఎం కెసిఆర్ వినతి మేరకు కరోనా నియంత్రణ చర్యల్లో భాగంగా రాష్ట్రానికి రెమ్‌డెసివిర్, ఆక్సిజన్ కేటాయింపులు పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయెల్ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు ఫోన్ చేసి చెప్పారు. తెలంగాణకు ప్రస్తుతం ఇస్తున్న 5,500 రెమిడెసివిర్ల ఇంజక్షన్ల సంఖ్యను, సోమవారం నుంచి 10,500 కి పెంచుతున్నట్టుగా కేంద్ర మంత్రి సీఎంకు తెలిపారు. ఆక్సిజన్ సరఫరాను పెంచాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని డిమాండు చేస్తున్న నేపథ్యంలో అదనంగా 200 టన్నుల ఆక్సీజన్ ను తెలంగాణకు సరఫరా చేయాలని కేంద్రం నిర్ణయించిందన్నారు. త్వరలో టీకాలను సైతం సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
గత వారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీకి సిఎం కెసిఆర్ రాష్ట్రంలో ఉన్న అవసరాలను తెలియజేశారు. ఈ మేరకు ప్రధాని మోడీ.. కేంద్ర పీయూష్ కు ఆదేశాలు జారీ చేశారు. దాంతో ఆయన సిఎం కెసిఆర్‌తో శనివారం రాత్రి ఫోన్ చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సోమవారం తెలంగాణకు పెంచి 5,000 రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు పంపిణీ అవుతాయని తెలిపారు. ఆక్సిజన్‌ను ఛత్తీస్‌గఢ్‌లోని బిలాయ్ నుంచి, ఒడిషాలోని అనుగుల్ నుంచి, పశ్చిమబెంగాల్‌లోని దుర్గాపూర్ నుంచి సరఫరా చేయాలనిర్ణయించినట్లు కేంద్ర మంత్రి సిఎంకు వివరించారు. సరఫరాకు సంబంధించి సమన్వయం చేసుకోవాల్సిందిగా కేంద్రమంత్రి సీఎం ను కోరారు. కాగా టీకాలను పెద్ద ఎత్తున సరఫరా చేయాలని కేంద్రమంత్రిని సిఎం కోరారు.
దీనికి కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.