తెలంగాణలో అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్: సిఎం కెసిఆర్

హైదరాబాద్ (CLiC2NEWS): తెలంగాణలో ప్రజలందరికీ ఉచిత వ్యాక్సిన్ అందించనున్నట్లు రాష్ట్ర సిఎం కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. రాష్ట్రంలో నానాటికీ పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తాజా పరిస్థితులను గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో వైద్య పరీక్షల తర్వాత అధికారులతో సమీక్ష జరుపనున్నట్లు వివరించారు. ఆక్సిజన్, రెమ్డెసివర్ కొరత రాకుండాఆ చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు.
వయసుతో సంబంధం లేకుండా టీకా..
స్వంతంగా రాష్ట్ర జనాభా, ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి వచ్చి అనేక సెక్టార్లలో పనిచేస్తున్న జనాభా కలుపుకుని, తెలంగాణ రాష్ట్రంలో సుమారు నాలుగు కోట్లమంది దాకా ప్రజలు వున్నారని, వీరిలో ఇప్పటికే 35 లక్షల మందికి పైగా వ్యక్తులకు వాక్సినేషన్ (టీకా) ఇవ్వడం జరిగిందని, మిగతా అందరికీ వయసుతో సంబంధం లేకుండా, రాష్ట్రంలో వున్న ప్రతివారికీ వాక్సినేషన్ ఇవ్వాలని సిఎం కెసిఆర్ నిర్ణయించారు. ఇలా మొత్తం అందరికీ వాక్సినేషన్ ఇవ్వడానికి సుమారు రూ. 2,500 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు అవుతుందనీ, ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదనీ, అందరికీ వాక్సినేషన్ ఇవ్వడం జరుగుతుందనీ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.