తెలంగాణ‌లో కొత్త‌గా 316 కరోనా కేసులు

హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంట‌ల వ‌ర‌కు 32,714 క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా 316 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. దీంతో మొత్తం ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 2,81,730కి చేరింది. తాజాగా వైరస్‌ నుంచి 612 మంది కోలుకోగా.. ఇప్పటి వరకు 2,73,625 మంది డిశ్చార్జి అయ్యారు. వైరస్‌ ప్రభావంతో మరో ఇద్దరు మృత్యువాతపడగా.. మొత్తం మృతుల సంఖ్య 1515కు చేరింది. ఈ మేర‌కు వైద్య, ఆరోగ్యశాఖ సోమ‌వారం ఉద‌యం బులిటెన్ విడుద‌ల చేసింది. కరోనా మరణాల రేటు రాష్ట్రంలో 0.53శాతంగా ఉందని, రికవరీ రేటు 97.12శాతంగా ఉందని వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6590 యాక్టివ్‌ కేసులున్నాయని, మరో 4467 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారని వివరించింది. ఆదివారం ఒకే రోజు తెలంగాణ వ్యాప్తంగా 32,714 టెస్టులు చేసినట్లు పేర్కొంది. ఇప్పటి వరకు 64,75,766 శాంపిల్స్‌ పరీక్షించామని, ఇంకా 554 నమూనాల ఫలితాలు రావాల్సి ఉందని చెప్పింది. ప్రతి పది లక్షల జనాభాకు 1,73,986 మందికి టెస్టులు చేసినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 86, రంగారెడ్డి జిల్లాలో 30, మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 22, కరీంనగర్‌లో 18, సంగారెడ్డిలో 14 ఉన్నాయని చెప్పింది.

Leave A Reply

Your email address will not be published.