దేశంలో 18 కోట్ల మందికిపైగా.. vaccine

న్యూఢిల్లీ (CLiC2NEWS): దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. కరోనా కట్టడికోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకుంటున్నాయి. కాగా కరోనాను కేవలం వ్యాక్సిన్‌తో మాత్రమే ఎదుర్కొవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఈ క్రమంలో దేశంలో పెద్ద ఎత్తున వ్యాక్సినేషన్ ప్రక్రియకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ ఏడాది జనవరి 16న ప్రారంభమైన వ్యాక్సిన్ పంపిణీ మరో మైళురాయిని అధిగమించింది. దేశంలో నిన్న 8 గంటల వరకు 18 కోట్ల మందికిపైగా మంది వ్యాక్సిన్ తీసుకున్నారు.
కేంద్ర కుటుంబ సంక్షేమ, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం శుక్రవారం రాత్రి వరకు దేశవ్యాప్తంగా 18,04,29,261 మంది టీకా వేసుకున్నారు. ఇందులో 96,27,199 మంది ఆరోగ్య కార్యకర్తలు మొదటి డోసు తీసుకున్నారని, మరో 66,21,675 మంది రెండో డోసు వేయించుకున్నారని తెలిపింది.
శుక్రవారం (నిన్న)నాటికి 10,79,759 మందికి టీకా పంపిణీ చేశామని పేర్కొంది. ఇందులో 6,16,781 మంది తొలి డోసు, 4,62,978 మంది రెండో డోసు తీసుకున్నారని తెలిపింది. నిన్న ఒక్కరోజే 18 నుంచి 44 ఏండ్ల లోపువారు 3,25,071 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని, దీంతో మొత్తం 42,55,362 మంది టీకా పొందారని వెల్లడించింది.