నష్టం రూ.5వేల కోట్లు

ప్రధాని మోదీకి ముఖ్యమంత్రి కేసీఆర్‌ లేఖ

హైదరాబాద్‌:  భారీ వర్షాలు, వరదల వల్ల ప్రాథమిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో రూ.5 వేల కోట్లకు పైగా నష్టం జరిగిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. తక్షణ సహాయ, పునరావాస చర్యల కోసం రూ.1,350 కోట్లు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్రమోదీకి గురువారం లేఖ రాశారు. వరదలతో తీవ్రంగా నష్టపోయిన రైతులకు రూ.600 కోట్లు, జీహెచ్‌ఎంసీతో పాటు ఇతర ప్రాంతాల్లో సహాయ, పునరావాస, పునరుద్ధరణ చర్యల కోసం మరో రూ.750 కోట్ల సాయం అందించాలని కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల తలెత్తిన పరిస్థితిపై చర్చించడానికి గురువారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

ఇకపై వరద ముంపు లేకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై అధికారుల‌కు దిశానిర్దేశం చేశారు. జ‌హెచ్ెంసి‌లో వరదల తీవ్రతను తొంద‌ర‌గా పరిస్థితిని చక్కదిద్దాలని సూచించారు. బాధితులకు నిత్యావసర సరుకులతోపాటు ప్రతి ఇంటికి మూడు రగ్గులను అందించాలని అన్నారు. హైదరాబాద్‌ పరిధిలో సహాయక చర్యలు చేపట్టడానికి వీలుగా జీహెచ్‌ఎంసీకి తక్షణమే రూ.5 కోట్లు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇళ్లు కూలిపోయిన వారందరికీ కొత్తవి మంజూరు చేస్తామని, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్ల మరమ్మతులకు ఆర్థికసాయం చేస్తామని పేర్కొన్నారు.

అపార్ట్‌మెంట్లకు కొత్త నిబంధనలు
హైదరాబాద్‌ నగరంలో వరదల పరిస్థితిని గమనిస్తే, చాలాచోట్ల చెరువుల ఎఫ్‌టీఎల్‌ పరిధిలో ఏర్పాటైన కాలనీలే జలమయమయ్యాయని సీఎం కేసీఆర్‌ చెప్పారు. అపార్టుమెంట్ల సెల్లార్లలో నీళ్లు నిలవడం వల్ల కూడా చాలాచోట్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. అపార్ట్‌మెంట్‌ సెల్లార్లలో నీళ్లు నిల్వకుండా ఉండే ఏర్పాటు.. నిర్మాణ సమయంలోనే చేసి ఉండాల్సిందని చెప్పారు. ఇకనుంచి అపార్ట్‌మెంట్ల నిర్మానానికి అనుమతిచ్చే సందర్భంలో వరదనీరు సెల్లార్లలో నిలిచి ఉండకుండా బయటకు వెళ్లే ఏర్పాటుకూడా ఒక నిబంధనగా పెట్టాలని అధికారులను ఆదేశించారు. కాలనీలు, అపార్టుమెంట్లలో నిలిచిన నీళ్లను తొలగించడానికి మెట్రో వాటర్‌ వర్స్‌, ఫైర్‌ సర్వీస్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు.

వరదల వల్ల జరిగిన నష్టం వివరాలు

  • రాష్ట్ర వ్యాప్తంగా 7.35 లక్షల ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. ఇందులో సగం పంటకు నష్టం కలిగినా.. దాని విలువ రూ.2వేల కోట్లు.
  • మరణించిన వారి సంఖ్య 50, వీరిలో జీహెచ్‌ఎంసీ పరిధిలో 11 మంది ఉన్నారు
  • హైదరాబాద్‌లోని 72 ప్రాంతాల్లోని 144 కాలనీల్లో 20,540 ఇండ్లు నీటిలో చిక్కుకున్నాయి. 35 వేల కుటుంబాలు ప్రభావితమయ్యాయి. ఎల్‌బీనగర్‌, చార్మినార్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ జోన్లలో వరదల ప్రభావం ఎక్కువున్నది. హైదరాబాద్‌లో 14 ఇండ్లు పూర్తిగా, 65 ఇండ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయచర్యలు చేపడుతున్నాయి. 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి. అన్నిచోట్ల రోడ్ల పునరుద్ధరణ కొనసాగుతున్నది. హైదరాబాద్‌ నగరంలో 72 చోట్ల పునరావాస కేంద్రాలు ప్రారంభించి, ప్రభావిత ప్రజలకు తాత్కాలిక ఆవాసం, భోజనం కల్పించారు. రోజుకు 1.10 లక్షల మందికిభోజనం అందిస్తున్నారు.
  • హైదరాబాద్‌తోపాటు రాష్ట్రంలోని 30 పట్టణాల్లో వరదల ప్రభావం ఉంది. 238 కాలనీలు జలమయమయ్యాయి.
  • 445 చోట్ల బీటీ రోడ్లు, 6 చోట్ల నేషనల్‌ హైవేలు దెబ్బతిన్నాయి. అన్ని చోట్ల రోడ్ల పునరుద్ధరణ జరుగుతోంది.
  • ట్రాన్స్‌కో పరిధిలో 9 సబ్‌ ేస్టషన్లు, ఎస్పీడీసీఎల్‌ పరిధిలో 15సబ్‌స్టేషన్లు, ఎన్పీడీసీఎల్‌ పరిధిలో 2సబ్‌ స్టేషన్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. మూసీ నది వెంట ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంటు స్తంభాలు కొట్టుకుపోయాయి. విద్యుత్తుశాఖకు రూ.5 కోట్ల మేర నష్టం జరిగింది.
  • 101 చెరువు కట్టలు తెగాయి. 26 చెరువు కట్టలకు బుంగలు పడ్డాయి. జలవనరుల శాఖకు రూ.50 కోట్ల నష్టం జరిగినట్లు అంచనా.
  • పంచాయతీరాజ్‌ రోడ్లు 475 చోట్ల దెబ్బతిన్నాయి. 269 చోట్ల రోడ్లు తెగిపోయాయి. సుమారు రూ.295కోట్ల వరకు నష్టం జరిగింది.
  • ఆర్‌ అండ్‌ బి రోడ్లు 113 చోట్ల దెబ్బతిన్నాయి. ఆర్‌ అండ్‌ బి పరిధిలో రూ.184 కోట్లు, నేషనల్‌ హైవేస్‌ పరిధిలో రూ.11 కోట్లు నష్టం జరిగినట్లు అంచనా.
Leave A Reply

Your email address will not be published.