పంజాబ్‌లో రాత్రివేళల్లో కర్ఫ్యూ
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మళ్లీ విజృంభిస్తోంది. రోజు రోజుకి కేసలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా కొన్ని రాష్ట్రాల్లో కేసుల సంఖ్య బెంబేలెత్తిస్తోంది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీనగరంలో పలు ఆంక్షలు విధించారు. ఢిల్లీలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతున్నాయి. ఢిల్లీతో పాటు ఇతర రాష్ట్రాల్లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో పంజాబ్‌లో ప్రభుత్వం మరోసారి ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. రెండు వారాల పాటు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించనున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా రెండోదశ కొనసాగుతుందని, దీంతో డిసెంబర్ 1 నుండి రాత్రి వేళల్లో 10.00 గంటల నుండి ఉదయం 5.00 గంటల వరకు కర్ఫ్యూ విధిస్తున్నట్లు ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్స్ రాత్రి 9.30 కల్లా మూసివేయాలని ఆదేశించారు. వివాహాది వేడుకలు కూడా త్వరగా ముగించుకోవాలని అన్నారు. మాస్క్‌లు ధరించకపోయినా, సామాజిక దూరం పాటించకపోయినా రెట్టింపు జరిమానా విధించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 15న మరోసారి పరిస్థితిని సమీక్షించి, తదుపరి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిపారు. కాగా, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్, చత్తీస్‌ఘర్, మధ్యప్రదేశ్‌ల అనంతరం రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధిస్తున్న ఆరో రాష్ట్రంగా పంజాబ్ నిలిచింది.