ప్లాస్మా దానం చేయండి.. భయపడొద్దు…!

హైదరాబాద్: ప్లాస్మా దానం చేసేందుకు ఎవరూ భయపడొద్దని ప్రముఖ సినీ దర్శకులు రాజమౌళి సూచించారు. ప్లాస్మా దానంపై మంగ‌ళ‌వారం సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్‌లో అవ‌గాహ‌న స‌దస్సు జ‌రిగింది. ఈ కార్య్ర‌క‌మంలో ప్రముఖ దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తదితరులు పాల్గొన్నారు.  ఈసంద‌ర్భంగా రాజ‌మౌళి మాట్లాడుతూ.. సకాలంలో కరోనాను గుర్తిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. కరోనా విషయంలో ఎవరూ నిర్లక్ష్యం చేయొద్దని కోరారు. పౌష్ఠికాహారం తీసుకుంటూ.. వైద్యులు సూచించిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను జయించవచ్చన్నారు.

సంగీత దర్శకులు కీరవాణి మాట్లాడుతూ.. ప్లాస్మా దానంపై అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. కొవిడ్‌ నుంచి కోలుకున్న వారు ప్లాస్మాదానానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ప్లాస్మా అనేది ప్రాణాలు కాపాడే సంజీవినితో సమానమన్నారు. తమ కుటుంబం, సిబ్బంది ప్లాస్మాదానం చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పారు. సిపి సజ్జనార్‌ మాట్లాడుతూ.. కరోనా బాధితులపై వివక్ష చూపొద్దని, వారే రేపటి ప్రాణదాతలని పేర్కొన్నారు. ప్లాస్మా దానం చేసేందుకు కరోనా నుంచి కోలుకున్నవారు ముందుకు రావాలని కోరారు. ప్లాస్మా దానంపై అవగాహన కల్పిస్తూ లఘుచిత్రం, సంగీత దర్శకుడు కీరవాణి రూపొందించిన పాటను విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజమౌళి, కీరవాణిని సిపి సజ్జనార్‌ సత్కరించారు.

Leave A Reply

Your email address will not be published.