ప‌.గో.లో కుటుంబాన్ని బ‌లిగొన్న మ‌హమ్మారి

కొవ్వూరు:  ప్ర‌పంచాన్నిఉక్కిరిబిక్కిరి చేస్తున్న క‌రోనా మ‌హ‌మ్మారి ఓ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. ఇంటిపెద్ద కరోనాతో చనిపోవడంతో కుటుంబసభ్యుల్ని కలిచి వేసింది. ఇక తమకు దిక్కెవరు అంటూ మనస్తాపంతో గోదావరిలో దూకేశారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలంలో చోటుచేసుకున్న ఈ విషాద సంఘటనపై స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాలివి..

కొవ్వూరు మండలం పసివేదల గ్రామానికి చెందిన నరసయ్య వ్యవసాయం చూస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. అతనికి భార్య సునీత(50), కొడుకు ఫణికుమార్(25), కూతురు అపర్ణ(23) ఉండేవారు. తెలియకుండానే ఆయనకు కరోనా సోకింది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండటంతో చికిత్సలేవీ పనిచేయలేదు. ఈ నెల 16న నర్సయ్య తుదిశ్వాస విడిచాడు.
ఒక్కగానొక్క ఆధారాన్ని కోల్పోయి పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఆ కుటుంబానికి ఆదరణ కరువైంది. కరోనా సోకుతుందనే భయంతో బంధువులుగానీ, స్నేహితులుగానీ, చుట్టుపక్కలవాళ్లుగానీ కనీసం వాళ్లను పలకరించిన పాపానపోలేదు. పెద్దను కోల్పోయిన ఆ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురై చివరికి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది.

నర్సయ్య మరణాన్ని తట్టుకోలేకపోయిన భార్య, కొడుకు, కూతురు.. రైల్వే బ్రిడ్జి పై నుంచి గోదావరిలోకి దూకినట్లు వెల్లడైంది. భారీ వర్షాల కారణంగా గోదావరి ఇప్పటికే ఉగ్రరూపం దాల్చింది. వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో ఆ ముగ్గురి ఆచూకీ కనిపెట్టడం కష్టసాధ్యమైంది. గాలింపు చర్యలకు తీవ్ర ఆటంకాలు ఏర్పడ్డాయి. కేసును దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

నరసయ్య వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడని స్థానికులు చెప్తున్నారు. ఇంటి పెద్ద దిక్కును కోల్పోవడం వల్లే వారంతా ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని అంటున్నారు.

Leave A Reply

Your email address will not be published.