బీజేపీలో చేరిన విజయశాంతి

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి బిపెపిలో చేరారు. డిల్లీలో బిజెపి ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె పార్టీలో చేరారు. కషాయ కండువా కప్పి అరణ్ సింగ్ ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ.. 1998 జనవరి 26న తొలుత బిజెపిలో చేరానన్నారు. అప్పట్లో తెలంగాణ ఏర్పాటుకు బిజెపి అనుకూలంగా లేకపోవడం వల్ల బయటకొచ్చాను అన్నారు. అయితే పార్టీ విధానాలు నచ్చడం వల్లనే పార్టీలో చేరుతున్నట్లు ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తదితరులు పాల్గొన్నారు.
నిన్న ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌తో వెళ్లి అమిత్‌షాను కలిశారు. అమిత్ షాతో భేటీ తర్వాత మాట్లాడిన బీజేపీ నేతలు.. కుటుంబ, అవినీతి పాలనపై పోరాటం చేస్తామన్నారు. తాము ఆకర్ష్ ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదని, తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయమని చెప్పారు. సినిమా రంగంలో తనదైన ముద్రవేసిన విజయశాంతి 1998లో రాజకీయాల్లోకి వచ్చారు. ఎల్కే అద్వానికి సన్నిహితంగా ఉన్న విజయశాంతి నెల్లూరు బహిరంగ సభలో కాషాయ కండువా కప్పుకున్నారు. బిజెపిలో చేరిన వెంటనే పార్టీ జాతీయ మహిళా విభాగం మహిళా మోర్చ కార్యదర్శిగా ఆమెను నియమించారు. 1999లో సోనియా గాంధీ కడప పార్లమెంట్ నుంచి పోటీ చేస్తే విజయశాంతితో అక్కడ పోటీ చేయించాలని బిజెపి రెడీ అయింది. సోనియా కడప కాకుండా బళ్లారి నుంచి పోటీ చేయడంతో అప్పట్లో సోనియాతో తలపడే ఛాన్స్ మిస్సయ్యారు. ఆ తర్వాత బిజెపి నుంచి బయటికి వచ్చిన విజయశాంతి తల్లి తెలంగాణ పార్టీ పెట్టారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసం తన పార్టీని టిఆర్ఎస్లో విలీనం చేశారు. గులాబీ పార్టీ తరపున పోటీ చేసి 2009లో మెదక్ ఎంపీగా గెలిచారు.
టిఆర్ఎస్ తరపున ఆ ఎన్నికల్లో గెలిచిన ఇద్దరు ఎంపీల్లో విజయశాంతి ఒకరు. తెలంగాణ కోసం కేసియార్ విజయశాంతి పార్లమెంట్లో తన గళాన్ని వినిపించారు. ఆతరవాత జరిగిన తెలంగాణ ఉద్యమంలో రాములమ్మ క్రియాశీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడుతున్నసమయంలో కేసియార్‌తో విబేధించి 2014 ఫిబ్రవరిలో కాంగ్రెస్‌లో చేరారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ అనే నినాదంతో విజయశాంతి కాంగ్రెస్‌లో చేరిపోయారు. 2014లో కాంగ్రెస్ నుంచి మెదక్ అసెంబ్లీకి పోటీ చేసి టిఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. కొంత కాలం తర్వాత విజయశాంతిని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్‌గా ఎఐసిసి నియమించింది.