భాగ్యనగరంలో దంచికొడుతున్న వాన!

హైదరాబాద్: రాజధానిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. వేసవి తీవ్రతతో అవస్థలు పడుతున్న నగరవాసులకు ఈ వర్షం కాస్త ఊరటనిచ్చింది. ఇవాళ సాయంత్రం ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురవడంతో నగరం తడిసి ముద్దయింది. నగరంలోని పలు రోడ్లు వర్షపు నీరుతో జలమయం అయ్యాయి. శివారు ప్రాంతాలైన జీడిమెట్ల, గాజులరామారం, దుండిగల్, కాప్రా, సుచిత్ర, కొంపల్లి, కుత్బుల్లాపూర్, ఏఎస్రావు నగర్‌తోపాటు సైనిక్ పురి, నేరెడ్మెట్ తదితర ప్రాంతాల్లో మోస్తరు వర్షం కురిసింది.
రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో కూడా వర్షం కురిసింది. వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రహదారులపై వరద నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడ్డాయి. రాష్ట్రంలో ఉపరితల ద్రోణి కారణంగా రాగల మూడు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ ఓ మోస్తారు నుంచి తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొన్న విషయం తెలిసిందే.