మంత్రివర్గం నుంచి ఈటల బర్తరఫ్

హైదరాబాద్ (CLiC2NEWS): రాష్ట్ర మంత్రి వర్గం నుంచి మంత్రి ఈటల రాజేందర్‌ను బర్తరఫ్ చేశారు. ముఖ్యమంత్రి కెసిఆర్ సిఫారసు మేరకు రాష్ట్ర గరర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈటలను బర్తరఫ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ఉత్తర్వులో స్పష్టం చేశారు.
మెదక్ జిల్లాలోని అచ్పచంపేట పరిధిలో భూకబ్జా చేశారని ఆరోపణలు రావడంతో మంత్రి ఈటల రాజేందర్‌పై విచారణ వేగవంతమైంది. ఈ మేరకు బృందాలుగా ఏర్పడి మెదక్ జిల్లా అచ్చంపేటలో ఎసిబి, విజిలెన్స్ అధికారులు విచారణ చేశారు. తుఫ్రాన్ ఆర్డీవో శ్యామ్ ప్రకాశ్ నేతృత్వంలో ఆరు ప్రత్యేక బృందాలతో ఈటలకు చెందిన హ్యాచరీస్ సహా పక్కనే ఉన్న అసైన్డ్ భూములపై డిజిటల్ సర్వే నిర్వహించారు. తుఫ్రాన్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం, మాసాయిపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మెదక్ జిల్లా కలెక్టర్ హరీశ్ విజిలెన్స్ విచారణను పరిశీలించారు. కబ్జాకు గురైన భూముల్లో అసైన్డ్ భూమి ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందని కలెక్టర్ తెలిపారు. నిన్న దర్యాప్తుకు సంబంధించిన పూర్తి నివేదికను సిఎస్‌కు అందించారు.
భూకబ్జా ఆరోపణలు నిరూపితమయ్యాయని నిర్ధారణకు వచ్చిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఈటలను మంత్రివర్గం నుంచి తొలగిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈటల వద్ద ఉన్న ఆరోగ్య శాఖను శనివారం ప్రభుత్వం లాగేసుకోగా ఆ మరుసటి రోజే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడం తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
మంత్రి పదవి నుంచి ఈటలను బర్తరఫ్ చేస్తూ ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం సాయంత్రం గవర్నర్ తమిళి సై సౌందరరాజన్‌కు పంపారు. లేఖ అందిన వెంటనే గవర్నర్ ఆమోదం తెలిపారు. ఈటలను మంత్రివర్గం నుంచి తొలగిస్తున్నట్లు రాజ్‌భవన్ అధికారికంగా ప్రకటించింది. దీంతో ఈటల రాజేందర్ మాజీ మంత్రి అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్ కుమార్ గెజిట్ నోటిఫికేషన్ సైతం విడుదల చేశారు.