మాజీ మంత్రి ఎమ్మెస్సార్ కన్నుమూత

హైదరాబాద్ ()CLiC2NEWS): కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి ఎం సత్యనారాయణ రావు (87) కన్నుమూశారు. కరోనా బారినపడిన ఎమ్మెస్సార్ హైదరాబాద్‌లోని నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారు జామున 3.45 గంటలకు తుదిశ్వాసవిడిచారు. ఎమ్మెస్సార్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలో విలక్షణ నేతగా గుర్తింపు పొందారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విలక్షణ నేతగా ఎమ్మెస్సా కు గుర్తింపు ఉంది.
1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో ఎమ్మెస్సార్ కీలకపాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజాసమితి తరఫున లోక్‌సభకు ఎన్నికయ్యారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన.. 1980-83 వరకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985-88 వరకు సుప్రీంకోర్టులో సీనియర్ కౌన్సిల్‌గా బాధ్యతలు నిర్వహించారు.
1990-94 వరకు రెండుసార్లు ఏపీఎస్ ఆర్టీసీ చైర్మన్‌గా ఉన్నారు. 2000-04 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 2004లో కరీంనగర్ నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 2004-07 వరకు సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2006లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో సవాల్ చేసి కరీంనగర్ లోక్‌సభ ఉపఎన్నికకు కారణమయ్యారు. ఆ ఎన్నికల్లో కేసీఆర్ భారీ మెజార్టీతో గెలుపొందడంతో ఎమ్మెస్సార్ తన మంత్రిపదవికి రాజీనామా చేశారు.
సిఎం కెసిఆర్ సంతాపం..
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ మృతిపట్ల సిఎం కెసిఆర్ సంతాపం ప్రకటించారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా ఆయన ప్రత్యేక శైలి కనబరిచారని సిఎం కొనియాడారు. ఎమ్మెస్సార్ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.