కంబోడియాకు నిరుద్యోగుల తరలింపు కేసులో కీలక నిందితుడు అరెస్టు
హైదరాబాద్ (CLiC2NEWS): కంబోడియాలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని .. నిరుద్యోగులను కంబోడియా దేశానికి పంపించి సైబర్ నేరాలను చేయిస్తున్న కీలక నిందితుడిని సైబర్ సెక్యూరిటి బ్యూరో పోలీసులు అరెస్టు చేశారు. సుమారు 500 నుండి 600 మంది భారతీయులు కాంబోడియాలోని కాల్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ కేసులో కీలక నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌కి చెందిన సదాకత్ ఖాన్ ను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణలో సిరిసిల్లకు చెందిన యువకుడికి ఏజెంట్ సాయి ప్రసాద్ పరిచయమయ్యి, కాంబోడియాలో ఉద్యోగం ఉందని చెప్పాడు. యువకుడి వద్ద నుండి రూ.1.40లక్షలు తీసుకుని ముంబయికి చెందిన మహ్మద్ అబిద్ అన్సారి, షాదాబ్ అలామ్‌లను పరిచయం చేశాడు. దుబాయ్‌లో ఉంటున్న సదాకత్ ఖాన్ సాయంతో బాధితుడిని కంబోడియా పంపించారు. అక్కడ బాధితుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చైనాకు చెందిన సైబర్ నేరాలు చేసే కాల్ సెంటర్‌లో రోజుకు 16 నుండి 17 గంటలు పనిచేయించేవారు. ఎన్నో చిత్రహింసలకు గురైన ఆ యువకుడు చివరికి స్వగ్రామం చేరుకున్నాడు. బాధితుడు తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏజెంట్ సాయి ప్రసాద్, అబిద్ అన్సారి, షాదాబ్ అలామ్‌లను అరెస్టు చేసిప పోలీసులు తాజాగా సదాకత్ ఖాన్‌ను అరెస్టు చేశారు.