ముంబ‌యిని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాల‌ని కర్ణాట‌క‌ డిమాండ్‌

మ‌హారాష్ట్ర‌, కర్ణాట‌క‌ మ‌ధ్య ఉన్న స‌రిహ‌ద్దు వివాదం మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చింది. క‌ర్నాట‌క స‌రిహ‌ద్దుల్లో మ‌రాఠీ మాట్లాడే ప్రాంతాల‌ను కేంద్ర పాలిత ప్రాంతాలుగా ప్ర‌క‌టించాల‌ని మ‌హారాష్ట్ర సీఎం ఉద్ద‌వ్ ఠాక్రే ప్ర‌క‌ట‌న చేయ‌డంతో కొత్త వివాదం త‌లెత్తింది. ముంబైని కూడా యూటీగా ప్ర‌క‌టించాల‌ని కర్ణాట‌క ఉప ముఖ్య‌మంత్రి ల‌క్ష్మ‌ణ్ సవాది తెలిపారు. ముంబ‌యి మ‌హాన‌గ‌రాన్ని త‌మ రాష్ట్రంలో క‌ల‌పాల‌ని, అంత వ‌ర‌కు ఆ న‌గ‌రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్ర‌క‌టించాల‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

అస‌లు ఏం జ‌రిగిందంటే…

కర్ణాటక, మహారాష్ట్రాల సరిహద్దు వివాదాలపై రూపొందిన పుస్తకావిష్కరణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో ఠాక్రే పాల్గొని మాట్లాడుతూ.. సుప్రీంకోర్టులో కేసు విచారణ జరుగుతున్న సమయంలో కర్ణాటక ప్రభుత్వం కోర్టు ధిక్కారానికి పాల్పడి బెళగావి పేరు మార్చిందని ఆరోపించారు. సరిహద్దులో ఉన్న ప్రాంతాలను యూటీలుగా ప్రకటించాలని డిమాండ్‌ చేశారు.
ఈ వ్యాఖ్యలను కర్ణాటక ప్రభుత్వం తప్పుబట్టింది. ఆ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి లక్ష్మణ్‌ సవాడీ స్పందిస్తూ.. సరిహద్దు వివాదంపై సుప్రీంకోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నామని, తమ రాష్ట్రంలోని కొంతమంది ప్రజలు ముంబయి-కర్ణాటక ప్రాంతానికి చెందినవారేనని, అందువల్ల ముంబయిపై తమకూ హక్కు ఉందని, ఆ ప్రాంతాన్ని కర్ణాటకలో కలపాలని, అప్పటి వరకూ ముంబయిని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేంద్రాన్ని కోరుతున్నా అంటూ కౌంటర్‌ ఇచ్చారు. దీంతో ఈ రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఇంకా ముదురుతోందనిపిస్తోంది.

సువ‌ర్ణ విధాన సౌధ..‌
1956 రాష్ట్రాల పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ట్టం త‌ర్వాత మ‌హారాష్ట్ర‌, క‌ర్నాట‌క మ‌ధ్య స‌రిహ‌ద్దు వివాదం మొద‌లైంది. బెల్గామ్‌తో పాటు బాంబే స్టేట్‌లోని ప‌ది తాలుకాల‌ను మైసూర్ స్టేట్‌లో క‌లిపింది. అయితే ఈ కేసు సుప్రీంలో చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్న‌ది. బెల్గావీ, క‌ర్వార్‌, నిప్పాని ప్రాంతాల్లో ఉన్న మెజారిటీల్లో మ‌రాఠీ భాష మాట్లాడేవాళ్లు ఉన్న‌ట్లు మ‌హారాష్ట్ర వాదిస్తున్న‌ది. అయితే బెల్గామ్‌ను త‌మ రాష్ట్రంలో ఒక భాగంగా మార్చామ‌ని, అక్క‌డ సువ‌ర్ణ విధాన స‌భ‌ను నిర్మించామ‌ని, ప్ర‌తి ఏడాది ఓ సారి మండ‌లి స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని క‌ర్నాట‌క పేర్కొన్న‌ది.

కాగా ఒకప్పుడు బాంబే ప్రెసిడెన్సీలో భాగంగా ఉన్న బెళగావి తదితర ప్రాంతాలు ఆ తర్వాత మైసూరు రాష్ట్రంలో కలిశాయి. ఇక్కడ ఎక్కువ మంది ప్రజలు మరాఠీనే మాట్లాడతారు. కాబట్టి వాటిని తమ రాష్ట్రంలో కలపాలంటూ మహారాష్ట్ర డిమాండ్‌ చేస్తోంది. దీనిపై బెళగావి కేంద్రంగా 1948లో ఏర్పడిన మహారాష్ట్ర ఏకీకరణ సమితి పోరాటం కొనసాగిస్తోంది. 1956లో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు జనవరి 17న ఆ ప్రాంతాలను కర్ణాటకలో కలిపారు. దీనికి వ్యతిరేకంగా మహారాష్ట్ర ఏకీకరణ సమితి చేపట్టిన ఆందోళనల్లో 10 మంది మరణించారు కూడా. ఆ తర్వాత 1967 మహజన్‌ కమిషన్‌ నివేదక ప్రకారం బెళగావి తదితర ప్రాంతాలు కర్ణాటకలోనే ఉన్నాయి.

Leave A Reply

Your email address will not be published.