రాజస్థాన్: అనారోగ్యంతో కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి

జైపూర్: రాజస్థాన్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే గజేంద్రసింగ్ శక్తావత్ (48) మరణించారు. గత కొంత కాలంగా లివర్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న ఆయన.. బుధవారం ఉదయం ఢిల్లీలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గజేంద్ర శక్తావత్ మృతికి రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, రాజస్థాన్ పీసీసీ అధ్యక్షుడు గోవింద్‌సింగ్ దొతస్రా, రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్‌పైలట్, ఇతర నాయకులు సంతాపం తెలియజేశారు.
ఇటీవల ఆయనకు కరోనా పాజిటివ్ కూడా వచ్చినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. గజేంద్రసింగ్ శక్తావత్కు భార్య, ఒక కొడుకు, ఇద్దరు బిడ్డలు ఉన్నారు. ఉదయ్‌పూర్ జిల్లాలోని వల్లభ్‌నగర్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.