రూ. 62 వేల కోట్లు కట్టాల్సిందే
సహారా ఇండియా గ్రూపు అధినేత సుబ్రతా రాయ్‌కు సెబీ ఆల్టిమేటం జారీ

న్యూఢిల్లీ : సహారా ఇండియా పరివార్ గ్రూపు అధినేత సుబ్రతా రాయ్‌కు సెక్యూర్టీస్ అండ్ ఎక్స్‌చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) ఆల్టిమేటం జారీ చేసింది. సుబ్రతా రాయ్ తక్షణం 62,600 కోట్లు కట్టాలని లేదంటే ఆయనకు పెరోల్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టులో సెబీ పిటిషన్ దాఖలు చేసింది. రాయ్‌కి చెందిన రెండు గ్రూపులు, వడ్డీతో సహా మొత్తం 62,600 కోట్లు చెల్లించాలని సెబీ తన పిటిషన్‌లో పేర్కొన్నది. 2012, 2015లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను సహారా గ్రూప్ పాటించలేదని సెబీ పిటిషన్‌లో పేర్కొంది. ఓ వైపు రోజు రోజుకీ రుణాలు పెరుగుతున్నా.. వారు మాత్రం కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ బయట ఆనందంగా తిరుగుతున్నారని సెబీ విమర్శించింది. సహారా గ్రూప్ తక్షణమే బకాయిలు మొత్తం జమ చేసేలా ఆదేశించాలని న్యాయ స్థానాన్ని కోరింది.
సెబీకి అవసరమైన పత్రాలు ఇవ్వకుండా సహారా ఇండియా రియల్ ఎస్టేట్ కార్పొరేషన్ లిమిటెడ్, సహారా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్‌లు 3.07 కోట్ల మంది ఇన్వెస్టర్ల నుండి వరుసగా రూ. 19,400.87 కోట్లు, రూ. 6,380.50 కోట్లను సేకరించాయి. ఈ వ్యవహారం కాస్తా సుప్రీంకోర్టుకు చేరడంతో నిబంధలనకు విరుద్ధంగా సేకరించిన ఆ మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి ఇన్వెస్టర్లకు చెల్లించాలంటూ 2012లో సర్వోన్నత న్యాయస్థానం సహారా గ్రూప్‌ను ఆదేశించింది. ఎనిమిదేళ్ల క్రితం ఆ మొత్తం రూ. 25 వేల కోట్లు కాగా..ఇప్పుడది రూ. 62,600 కోట్లకు పెరిగింది. అయినప్పటికీ సహారా గ్రూప్ డబ్బు చెల్లించకపోవడంతో ఆ సంస్థల అధినేత సుబ్రతా రాయ్, మరికొందరిని కస్టడీలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అరెస్టై రెండేళ్ల పాటు ఢిల్లీలోని తీహార్ జైల్లో ఉన్న సుబ్రతా రాయ్, మరో ఇద్దరు డైరెక్టర్లు 2016లో బెయిల్‌పై విడుదలయ్యారు. అప్పటి నుండి వారు బయటే ఉన్నారు. 2020 ఫిబ్రవరి నాటికి సహారా గ్రూప్ రూ. 15,448 కోట్లు జమ చేసింది. ఆ తర్వాత ఎలాంటి చెల్లింపులు జరకపోవడంతో సెబీ మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. కాగా, సెబీ ఆరోపణలను సహారా ఖండిస్తోంది. సెబీ డిమాండ్ పూర్తిగా అర్థరహితమని, ఉద్దేశపూర్వకముగా సెబీ 15 శాతం వడ్డీ కలిపిందని ఆరోపించింది. ఇన్వెస్టర్లకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చినట్లు పేర్కొంది.
2012లో సహారా గ్రూపు కంపెనీలు సెక్యూర్టీ చట్టాలను ఉల్లంఘించి సుమారు 3.5 బిలియన్ల డాలర్ల సొమ్మును సమీకరించినట్లు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఎటువంటి బ్యాంకింగ్ సదుపాయాలు లేనటువంటి లక్షల సంఖ్య భారతీయుల నుంచి సహారా కంపెనీలు అక్రమ రీతిలో సొమ్ము సమీకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇన్వెస్టర్లను గుర్తించడంలో విఫలమైన సెబీ.. ఈ కేసులో రాయ్‌ను జైలుకు పంపింది.