విమోచనమా! విలీనమా?

నిజాం నిరంకుశ పాలన నుంచి స్వాతంత్ర్యం లభించిన రోజు ..
రజాకార్ల అకృత్యాలు, అరాచకాల నుంచి విముక్తి పొందిన దినం..
తెలంగాణ ప్రజల ధీరోదాత్త పోరాటానికి విజయం లభించిన సందర్భం..
సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణ విమోచనం..
హైదరాబాద్ః సెప్టెంబర్ 17, 1948.. చరిత్ర తెలియని వారికి ఈ తేదీ ప్రాధాన్యం పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చరిత్ర తెలిసిన వారి మనసు భావోద్వేగంతో నిండిపోతుంది. ఆనాటి స్వాతంత్య్ర సమరం, పోరాట యోధులు, త్యాగధనులను తలచుకొని వారికి నివాళులర్పిస్తారు. అదే సమయంలో కొందరు ఈ తేదీ గురించి చెపితే ఉలిక్కిపడతారు. ఆత్మవంచన చేసుకుంటారు. ఈ తేదీకి ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం లేదని వాదించే ప్రయత్నం చేస్తారు. 72 ఏళ్ల క్రితం అంటే సరిగ్గా ఇదే రోజున భారతదేశం నడిబొడ్డున ఒక ఆపరేషన్(పొలో) జరిగింది. క్యాన్సర్ లాంటి కణితిగడ్డ (నిజాం నిరంకుశపాలన) తొలగిపోయింది.. ఈ రోజున ఇక్కడి ప్రజలు స్వేచ్ఛాస్వాతంత్య్రాలు పొందారు. ఇది వాస్తవం. ముమ్మాటికీ వాస్తవం… కానీ ఈ సందర్భానికి ఎవరికి తోచిన భాష్యం వారు చెబుతారు. విమోచనం, విముక్తి, విలీనం. ఇలా రకరకాల పేర్లు పెట్టారు.
విమోచన దినోత్సవం చరిత్ర
1947 ఆగస్టు 15న బ్రిటిష్ వారి పాలన అంతమై భారతదేశమంతటా స్వాతంత్ర్య సంబరాలు జరుపుకున్నారు.. కానీ దేశం నడి బొడ్డున ఉన్న హైదరాబాద్ సంస్థాన ప్రజలకు ఆ అదృష్టం లేకుండా పోయింది. ఇక్కడి ప్రజలు మాత్రం ఇంకా నిరంకుశ రాచరిక పాలనలో మగ్గిపోవాల్సిన దుస్థితి. అప్పటి వరకూ బ్రిటిష్ వారికి సామంతుడిగా ఉన్న హైదరాబాద్ నవాబు మీర్ ఉస్మాన్ అలీఖాన్ తాను కూడా స్వతంత్రుడిని అయ్యానని ప్రకటించుకున్నాడు. హైదరాబాద్ అటు ఇండియాలో, ఇటు పాకిస్తాన్లో కలవదని స్వతంత్రంగా ఉంటుందని ప్రకటించాడు. కానీ సంస్థానంలోని ప్రజలు తాము భారతదేశంలో కలవాలని కోరుకున్నారు. ‘మా నిజాం రాజు తరతరాల బూజు..’ అని ప్రముఖ కవి దాశరథి కృష్ణమాచార్యులు అనాడే రాశాడు. ఈ వాఖ్యం ఆనాటి నిరంకుశ పాలనా విధానానికి అద్దంపడుతుంది. ఆనాటి హైదరాబాద్ సంస్థానంలోని తెలంగాణ, మరాఠ్వాడా, కర్ణాటక ప్రాంతాల్లో ఇంకా ప్యూడల్ పాలన కొనసాగుతోంది. ఒకవైపు దేశ్ముఖ్, జాగీర్దార్, దొరల వెట్టి చాకిరిలో గ్రామీణ ప్రజానీకం మగ్గిపోతుంటే, మరోవైపు నిజాం అండతో నరరూప రక్షసులైన రజాకార్లు చెలరేగిపోయారు.. ప్రజల మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. గ్రామాలపై పడి ప్రజలను దోచుకొని, హత్యాకాండను కొనసాగించారు. నిజాం ప్రోద్భలంతో రజాకార్ల నాయకుడు కాశీం రజ్వీ ఢిల్లీ ఎర్రకోటపై అసఫ్ జాహీ పతాకాన్ని ఎగురేస్తానని విర్ర వీగాడు.. ప్రజల ధన, మాన, ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. పురుషులను ఊచకోత కోసి, మహిళలను నగ్నంగా బతుకమ్మ ఆడించిన దారుణ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇప్పటికీ ఈ ఆకృత్యాల గురించి తెలంగాణ పల్లెల్లో కథలుకథలుగా చెప్పకుంటుంటారు. ఇది నిజం.
ఇలాంటి పరిస్థితిలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, ఆర్యసమాజ్ వారి వారి మార్గాల్లో పోరాటాన్ని చేపట్టాయి. ఆరంభంలో ఆంధ్ర మహాసభ పేరిట ప్రారంభమైన సాంస్కృతిక సామాజిక ఉద్యమం కాలక్రమంలో రాజకీయ స్వరూపాన్ని సంతరించుకుంది. ఆర్యసమాజం, స్టేట్ కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ప్రజల్లో చైతన్యాన్ని రగిలించాయి. మరోవైపు కమ్యూనిస్టు పార్టీ గ్రామీణ ప్రాంతాల్లో ‘భూమి కోసం భుక్తి కోసం’ పేరిట పోరాటం చేసింది. పలు ప్రాంతాల్లో ప్రజలు స్వచ్ఛంధంగా నిజాం పాలనను ఎదిరించారు.
ఉద్యమ ఉగ్రస్వరూపాన్ని పసిగట్టిన నిజాం ఉస్మాన్ అలీఖాన్ ఈ సంస్థలన్నింటినీ నిషేధించాడు. వీటిన్నింటిని నిర్దాక్షిణ్యంగా అణిచివేశాడు.. దానిలో భాగంగా నాయకులను, వారి మద్దతుదారులను బందించి కఠిన శిక్షలు విధించాడు. సామాన్య ప్రజలను ఊచకోత కోశాడు. ఈ నిజాం పెట్టిన బాధలు వర్ణనాతీతం.. ఈ నేపథ్యంలో.. “భారత దేశ నడిబొడ్డున క్యాన్సర్ కంతిలా మారిన హైదరాబాద్ సంస్థానంపై చర్య తీసుకోక తప్పదని“ నాటి హోం మంత్రి, సర్దార్ వల్లభాయి పటేల్ నిర్ణయం చేశారు. బ్రిటిష్ వారు దేశం విడిచి పెట్టిన తర్వాత 552 స్వదేశీ సంస్థానాల్లో చాలావరకు భారతదేశంలో విలీనం అయ్యాయి. వీటి విలీనంలో దేశ తొలి హోంమంత్రి సర్దార్ వల్లభభాయ్ పటేల్ కృషి మర్చిపోలేనిది. ఆయన కృషి మూలంగానే భారత్ ఐఖ్యంగా ఏర్పడింది. పటేల్ వ్యూహాలను ముందే ఊహించిన నిజాం నవాబు పాకిస్తాన్ సాయం కోసం వర్తమానం పంపడంతో పాటు, ఐక్యరాజ్య సమితిని ఆశ్రయించాడు.. ఈ పరిణామాల నేపథ్యంలో మేజర్ జనరల్ చౌదరి నాయకత్వంలో 1948 సెప్టెంబరు 13న భారత సైన్యం ఆపరేషన్ `పోలో` పేరిట హైదరాబాద్ సంస్థానాన్ని ముట్టడించింది. దీనికి పోలీస్ యాక్షన్ అనే పేరు పెట్టారు. ఈ చర్యకు ప్రతిచర్యగా రజకార్ల నాయకుడు కాశీం రజ్వీ `ఎర్రకోటమీద అసఫ్ జాహీ జెండా ఎగరవేస్తాం..` అని బీరాలు పలికాడు. సైన్యంతో పాటలు రజాకార్లు యుద్ధంలో దిగారు. కేలవం ఐదు రోజుల పోరాటం అనంతరం నిజాం సైన్యం చేతులెత్తేసింది. దాంతో ఆ తర్వాత సెప్టెంబరు 17న నిజాం నవాబు లొంగుబాటు ప్రకటన చేశారు. ఈ విధంగా హైదరాబాద్ వాసులకు స్వాతంత్ర్యం వచ్చింది. సెప్టెంబర్ 17, 1948 నాడు భారత దేశంలో సంపూర్ణంగా విలీనం అయింది. హైదరాబాదు రాష్ట్రం ఏర్పడింది. ఇన్నేళ్లుగా అనగారిన, నిర్ధాక్షిణ్యంగా అణచివేయబడిన తెలంగాణ (హైదరాబాద్) సంస్థానం స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంది… ఇంత గొప్ప ధీరోదత్త చరిత్ర ఉంది కాబట్టే సెప్టెంబరు 17ను తెలంగాణ విమోచన దినోత్సవంగా పాటిస్తారు.
ఇది మన వేరు.. ఇది మన చరిత్ర.. ఇది మన కళ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్ర. కానీ నేడు ఈ చరిత్రను ఎవరి తోచిన విధంగా వారు చెబుతున్నారు. నిజానికి హైదరాబాద్ రాష్ట్ర వాసులకు స్వాతంత్య్రం వచ్చింది 1948 సెప్టెంబర్ 17న. నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ విమోచనం పొంది, భారత దేశంలో విలీనం కావడం చారిత్రక సత్యం కాదంటారా… కాదనగలరా..? భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రలో 1947 ఆగస్టు 15కు ఎంత ప్రాధాన్యం ఉందో, తెలంగాణ విమోచనం జరిగిన 1948 సెప్టెంబర్ 17కూ అంతే ప్రాముఖ్యం ఉంది. ఈ రెండూ స్వాతంత్య్ర దినోత్స వాలే. దురదృష్టవశాత్తు తెలంగాణ ప్రజలు తెలంగాణ స్వాతంత్య్రదిన ఉత్సవాలను జరుపుకోలేక పోతున్నారు. ఇక్కడ మనం గమనించాల్సిన మరో ముఖ్యవిషయం ఏంటంటే.. హైదరాబాద్ సంస్థానం నుండి విడిపోయిన మరాఠ్వాడా(మహారాష్ట్ర) లోనూ, కర్ణాటక ప్రాంతాన్ని మైసూర్ స్టేట్‌లో ప్రతి ఏటా 17 సెప్టెంబర్ నాడు విమోచన దినోత్సవ వేడుకలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నాయి. కానీ పాత హైదరాబాద్ సంస్థానంలోని ప్రధాన భాగమైన తెలంగాణ మాత్రం ఈ అదృ ష్టానికి దూరంగా ఉండిపోయింది. దీనికి కారణమేమిటో “ఏలిన వారికే ఎరుక“ అన్నట్లు తయారైంది. ఇంత గొప్ప చరిత్ర ఉంది కాబట్టే మన తెలంగాణలో సెప్టెంబరు 17ను ‘తెలంగాణ విమోచన దినోత్సవం’గా పాటిస్తారు. ఇది నిజం.. ఎందుకంటే ఇది చరిత్ర కాబట్టి.. అయితే దీనిని తెలంగాణ విమోచన దినోత్సవంగా పరిగణించనివారు ‘తెలంగాణ విలీన దినోత్సవం’గా జరుపుకుంటారు.
ఇంత ప్రధాన్య మున్న ఈ రోజును మనం ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ గొప్ప స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న యోధులను, త్యాగధనులను తలచుకొని వారికి నివాళులర్పిద్దాం.
జై తెలంగాణ!