వైద్యారోగ్య శాఖకు కెసిఆర్ కీలక ఆదేశాలు

హైదరాబాద్ (CLiC2NEWS): దేశవ్యాప్తంగా పలు ఆసుపత్రులలో అగ్నిప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు కీలక ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ హాస్పిటళ్లలో అగ్నిమాపక వ్యవస్థను సమీక్షించాలని తెలిపారు. ప్రస్తుతం వేసవి కాలం కావడం, దీనికి తోడు అన్ని ఆస్పత్రులు కరోనా రోగులతో నిండి ఉన్న నేపథ్యంలో అగ్నిప్రమాదాలు జరగకుండా జాగ్రత్త వహించాలన్నారు. గాంధీ, టిమ్స్ లాంటి చోట్ల అగ్నిమాపక యంత్రాలు సిద్ధంగా ఉంచాలని సిఎం ఆదేశించారు.
“ఆక్సిజన్ ను యుద్ద విమానాలను ఉపయోగించి తీసుకువస్తున్నాం. అసరమున్న ప్రతి ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులకు ఆక్సిజన్ చేరాలి. ఆక్సిజన్ అవసరమైన ఆస్పత్రులకు చేరేలా సమన్వయం చేసుకోవాలి. కరోనా నిర్ధారణ పరీక్ష కిట్స్ కొరత ఏర్పడకుండా చూడాలి.
ప్రపంచంలో ఎక్కడ అందుబాటులో ఉన్నా వాటిని మన రాష్ట్రానికి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. కరోనా కిట్లు వాయు మార్గంలో తరలించేలా చర్యలు తీసుకోవాలి. కరోనా లక్షణాలు ఉన్న వారికి వెంటనే హోం ఐసోలేషన్ కిట్లు ఇవ్వాలి“ అని సిఎం కెసిఆర్ ఆదేశించారు.
హోం ఐసోలేషన్ కిట్స్ అందించాలి
ఎన్ని లక్షల మందికి అయిన హోం ఐసోలేషన్ కిట్స్ అందించడానికి వీలుగా కిట్స్ను సమకూర్చాలని సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. ప్రజలు కూడా కరోనా నియంత్రణకు పూర్తి సహకారం అందించాలని మంత్రి ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.