వ్యభిచారం క్రిమినల్ నేరం కాదు.
సెక్స్ వర్కర్ల విడుదలకు ముంబయి హైకోర్టు ఆదేశం
ముంబయిః వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని ముంబై హైకోర్టు పేర్కొంది. వయోజన మహిళకు తన వృత్తిని ఎంచుకునే హక్కు ఉందని తెలుపుతూ నిర్బంధంలో ఉన్న ముగ్గురు సెక్స్ వర్కర్లను తక్షణమే విడుదల చేయాలని ఆదేశించింది. గురువారం జారీ చేసిన ఉత్తర్వులో జస్టిస్ పృథ్వీరాజ్ చవాన్ ధర్మాసనం తీర్పును వెలువరించారు. వ్యభిచారం క్రిమినల్ నేరం కాదని ముంబై హైకోర్టు పేర్కొంది. 1956 అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం ప్రకారం వ్యభిచారం నేరపూరిత చర్యగా పరిగణించబడలేదన్నారు. మజ్గావ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ముగ్గురు మహిళలు దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ చవాన్ విచారించి తీర్పును ప్రకటించారు. గతేడాది సెప్టెంబర్లో ఓ గెస్ట్హౌజ్పై దాడి చేసిన పోలీసులు ముగ్గురు మహిళలను, మధ్యవర్తిని అదుపులోకి తీసుకున్నారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధితులుగా పేర్కొన్న ముగ్గురు మహిళలను పరివర్తన మార్పు కింద ఓ ఆశ్రమానికి తరలించారు. కాగా వీరి తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పిల్లల్ని అప్పగించాల్సిందిగా కోరుతూ మేజిస్ర్టేట్ కోర్టును ఆశ్రయించారు. వీరి విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. అప్పిల్కు వెళ్లగా మేజిస్ట్రేట్ ఆదేశాన్ని పక్కన పెట్టి జస్టిస్ చవాన్ తీర్పును వెలువరించారు. సదరు మహిళలు మేజర్స్. స్వేచ్ఛగా సంచరించేందుకు, వారికి ఇష్టమైన వృత్తిని ఎన్నుకునే ప్రాథమిక హక్కుకు వారు అర్హులు అని పేర్కొన్నారు. ఇప్పటికే వారిని చట్ట ప్రకారం విచారించినందున ఇకపై వారి నిర్బంధాన్ని కొనసాగించే ప్రశ్నే లేదన్నారు. అనైతిక ట్రాఫిక్ (నివారణ) చట్టం, 1956 ప్రకారం మూడు వారాల వ్యవధికి మించి బాధితులను అదుపులో ఉంచేందుకు మేజిస్ర్టేట్కు అధికారం లేదన్నారు. పిటిషనర్లు దుర్బుద్దితో ఇతరులను మోహిస్తున్నట్లుగా గానీ లేదా వారు వేశ్యాగృహం నడుపుతున్నారనడానికి గానీ ఎటువంటి ఆధారాలు రికార్డులో లేని కారణంగా తక్షణమే విడుదలకు ఆదేశాలు జారీ చేశారు.