సుశాంత్ కేసులో సుప్రీం సంచలన ఆదేశాలు

న్యూఢిల్లీ : సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును సిబిఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు బుధవారం కీలక తీర్పు వెలువరించింది. దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని ముంబై పోలీసులను ఆదేశించింది. మహారాష్ట్ర ప్రభుత్వం కూడా సిబిఐకి సహకరించాలని పేర్కొంది. బీహార్‌ ముఖ్యమంత్రి విజ్ఞప్తి మేరకు ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సిబిఐకి అప్పగించింది. సిబిఐ విచారణకు మహారాష్ట్ర ప్రభత్వం వ్యతిరేకించడంతో ఈ అంశం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో సుశాంత్‌ ఆత్మహత్య కేసును సిబిఐ విచారణకు అప్పగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అవసరమైతే కొత్తగా కేసు ఫైల్‌ చేసేందుకు సిబిఐకి అవకాశం కల్పించింది.
ముంబైలో జూన్‌ 14న బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి చెందిన విషయం తెలిసిందే. హీరో సుశాంత్ సింగ్ మృతిపై నెలకొన్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత ఉందని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా అభిప్రాయపడింది. ఈ క్రమంలోనే అన్ని అంశాలు బయటకు రావాలని చెబుతూ.. కేసును సీబీఐకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ముంబై పోలీసులకు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్ కితాబు
సుప్రీంకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన అనంతరం శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ముంబై పోలీసులకు బాసటగా నిలిచారు. ఈ కేసును ముంబై పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేశారని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై తాను వ్యాఖ్యానించబోనని, చట్టం గురించి అవగాహన కలిగి ప్రభుత్వంలో బాధ్యతాయుత పదవుల్లో ఉన్నవారు కోర్టు తీర్పుపై స్పందిస్తారని అన్నారు. తాను సుప్రీంకోర్టు తీర్పుపై మాట్లాడలేనని, ముంబై పోలీస్‌ కమిషనర్‌ లేదా తమ అడ్వకేట్‌ జనరల్‌ దీనిపై వ్యాఖ్యానిస్తారని రౌత్‌ తెలిపారు. సర్వోన్నత న్యాయస్ధానం ఇచ్చిన తీర్పుపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.