TS: సెకండ్ వేవ్ తీవ్రత అధికం: పబ్లిక్ హెల్త్ డైరెక్టర్

హైదరాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా సెకండ్‌వేవ్ వ్యాప్తి ఉధృతంగా ఉందని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ రావు తెలిపారు. కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత మొదటిసారిగా రెండు లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. కోఠీలో ఆ శాఖ ప్రధాన కార్యాలయంలో డాక్టర్ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. రకరోనా రెండో దశ వ్యాప్తి ఉధృతంగా ఉంది. మొదటి వేవ్‌ను ఎంతో కొంత అడ్డుకోగలిగాం. ప్రజల్లో అలసత్వం వచ్చింది. గాలి నుంచి వ్యాపించే దశకు కరోనా చేరుకుందని పేర్కొన్నారు. కొత్త మ్యుటేషన్ల కారణంగా కరోనా వేగంగా వ్యాపిస్తోందన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలని సూచించారు.
80 శాతం బాధితుల్లో లక్షణాలు లేవు..
రాష్ర్టంలో కొవిడ్ చికిత్సకు పడకలు, మందులు, ఆక్సిజన్ కొరత లేదు.. 116 ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్ చికిత్స కొనసాగుతుందని శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు. రాష్ర్టంలో ఎక్కడా బెడ్ల కొరత లేదని, కేవలం 15-20 కార్పొరేట్ ఆస్పత్రుల్లోనే పడకల కొరత ఉందని స్పష్టం చేశారు. జీహెచ్ఎంసీ పరిధిలో 5 కొవిడ్ ప్రత్యేక ఆస్పత్రులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో కొవిడ్ టెస్టుల సంఖ్యను పెంచుతామని ప్రకటించారు. 80 శాతం మంది కరోనా బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవు అని వెల్లడించారు. కరోనా పాజిటివ్ రాగానే ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
15 రోజుల్లోనే పాజిటివ్ కేసులు రెట్టింపు..
గాలిద్వారా వ్యాపించే దశకు కరోనా చేరిందని గతంలోనే స్పష్టంగా ప్రజలకు చెప్పాం. గతంలో ఒకరిసి ఐసోలేషన్ చేస్తే సరిపోయేది. ప్రస్తుతం బాధితుడిని గుర్తించేలోపే కుటుంబమంతా వైరస్ బారిన పడుతున్నారు. రోజుకు లక్షకు పైగా కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నాం. కేవలం 15 రోజుల్లో పాజిటివ్ రేటు రెట్టింపు అయ్యిందన్నారు. నిన్న ఒక్కరోజే లక్షా 26 వేల కరోనా పరీక్షలు నిర్వహిస్తే.. 4,446 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. కొవిడ్ వ్యాప్తి చెందిన తొలినాళ్లలో 18 వేల బెడ్లు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్యను 38 వేలకు పెంచామన్నారు. రాబోయే రెండు మూడు రోజుల్లో బెడ్ల సంఖ్యను 53 వేలకు పెంచుతామని తెలిపారు. కొవిడ్ టెస్టుల సంఖ్యను కూడా పెంచుతామన్నారు.