స్వాతంత్ర్య సంబురాలు ప్రారంభించిన కెసిఆర్

హైదరాబాద్: `ఆజాదీ కా అమృత్ మహోత్సవ్` పేరిటి స్వాతంత్ర్య సంబరాలు నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో ప్రారంభమయ్యాయి. ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న నేపథ్యంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. గాంధీ వచ్చిన తర్వాత స్వాతంత్ర్య ఉద్యమం ఉధృతంగా సాగిందన్నారు. మన స్వాతంత్ర్య పోరాటం ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. గాంధీ 1930, మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండి వరకు గాంధీ పాదయాత్ర చేశారు. గాంధీ చేపట్టిన దండి యాత్రలో హైదరాబాద్ ముద్దుబిడ్డ సరోజినీ నాయుడు పాల్గొన్నారని గుర్తు చేశారు. దండి యాత్ర స్వాతంత్ర్య సంగ్రామంలో అద్భుత ఘట్టమని సీఎం అన్నారు.
రాష్ర్టంలో 75 వారాల పాటు అమృత్ మహోత్సవ్ వేడుకలను నిర్వహిస్తున్నామని సీఎం తెలిపారు. ప్రభుత్వ సలహాదారుగా కొనసాగుతున్న రమణాచారి ఈ కమిటీ అధ్యక్షులుగా నియమించుకుని ముందుకు కొనసాగుతున్నామని తెలిపారు. ఈ వేడుకల కోసం రూ. 25 కోట్లు కేటాయించామని చెప్పారు.
గవర్నర్‌కు ధన్యవాదాలు
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను వరంగల్‌లో ప్రారంభించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్‌కు సీఎం కేసీఆర్ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఉత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులతో పాటు ప్రతి ఒక్కరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు. 75 వారాలపాటు ఈ ఉత్సవాలు కొనసాగనున్నాయి. గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వరంగల్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించి ఉత్సవాలను ప్రారంభించారు. గురువారం బీఆర్కే భవన్‌తోపాటు ప్రభుత్వ భవనాలు, జంక్షన్లను విద్యుత్తు దీపాలతో అలంకరించారు.