`హరి హర వీరమల్లు`గా పవన్..

పవన్ కళ్యాణ్ అభిమానులకు శుభవార్త. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో రూపొందుతోన్న తొలి చిత్రం పేరు ‘హరిహర వీరమల్లు’గా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎమ్.రత్నం మెగా సూర్య పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్ తో పాటు హీరో ఫస్ట్ లుక్ తో కూడిన టీజర్ కూడా మహాశివరాత్రి సందర్భంగా జనం ముందు నిలచింది. పవన్‌కల్యాణ్ 27వ ప్రాజెక్టుగా వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింఫ్స్ ను మహాశివరాత్రి సందర్భంగా మేకర్స్ విడుదల చేశారు. పవన్ కల్యాణ్ బిల్డింగ్ పై నుంచి నౌకవైపు జంప్ చేస్తూ ఎంట్రీ ఇస్తున్న సీన్ రొమాలు నిక్కపొడుచుకునేలా ఉంది.
ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ తొలి జానపద చిత్రం కాబట్టి ‘హరిహర వీరమల్లు’ అభిమానులలో భారీ అంచనాలు పెంచేలాగుంది. అదీగాక, నిర్మాత ఎ.ఎమ్.రత్నంకు పవన్ కళ్యాణ్ అచ్చివచ్చిన కథానాయకుడు. వారి కాంబోలో వచ్చిన ‘ఖుషి’ అప్పట్లో యువతను కిర్రెక్కించింది. మరి ఈ ‘హరిహర వీరమల్లు’ కూడా అభిమానులను విశేషంగా అలరిస్తుందనే అనిపిస్తోంది. పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ, మలయాళంతో పాటుగా హిందీలో కూడా రానుంది.