MAA: ప్రకాశ్ రాజ్ ప్యానెల్ నుండి గెలిచిన 11 మంది రాజీనామా..

హైదరాబాద్ (CLiC2NEWS): `మా` ఎన్నికలు ఎంత ఉత్కంఠగా జరిగాయో మనం చూశాం. ఎన్నికలు ముగిసి ఫలితాలు వచ్చాక అంతా చల్లబడింది అనుకున్న సమయంలో ప్రకాశ్ రాజ్ ప్యానల్ నుంచి గెలిచిన 11 మంది సభ్యులు ‘మా’కు రాజీనామా చేశారు. విష్ణుకి ఇబ్బందులు ఉండకూడదనే తమ మెంబర్స్ రాజీనామా చేసినట్లు ఈ సందర్భంగా ప్రకాశ్ రాజ్ తెలిపారు.
మంగళవారం ప్రకాశ్‌రాజ్ మీడియాతో మాట్లాడుతూ..
‘సినిమా బిడ్డలం’ ప్యానెల్ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్ ప్రకటించారు. మంచు విష్ణు ఇచ్చిన హామీలకు ఎలాంటి అవాంతరాలు ఎదురుకాకుండా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. తమ ప్యానెల్‌లోని సభ్యులంతా బయటకు వచ్చి, ‘మా’ సభ్యుల తరపున నిలబడతామని స్పష్టం చేశారు.
నటుడు బెనర్జీ మాట్లాడుతూ.. కన్నీరు పెట్టుకున్నారు. నన్ను మోహన్ బాబు అరగంట తిడుతూనే ఉన్నారు. ఎందుకు అలా చేశారో అర్ధం కాలేదు. దారుణంగా మాట్లాడారు. నేను ఎప్పుడూ ఇటువంటి మాటలు పడలేదు. ఆయన అన్న మాటలకు షాక్‌లోకి వెళ్లిపోయా.` అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.
శ్రీకాంత్ మాట్లాడుతూ..‘‘ఎవరు ఓటు వేసినా, ఒక ప్యానెల్ మొత్తానికి ఓటేయండి అని మేము మొదటి నుంచి ‘మా’ సభ్యులను కోరుతున్నాం. పని బాగా జరగాలంటే అది ముఖ్యం. మెంబర్స్ ఉన్న వాళ్లలో అందరూ అందరికీ నచ్చాలని లేదు. ఆ ప్యానెల్‌లో కొంతమంది, ఈ ప్యానెల్‌లో కొంతమంది గెలిచాం. అన్నేసి మాటలు అనుకున్నాకా కలిసి పనిచేయగలమా అనిపించింది. మా ప్యానెల్‌లోని సభ్యులు నిన్నే రాజీనామా చేస్తానని అన్నారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం.“ అని శ్రీకాంత్ తెలిపారు.
తనీశ్ మాట్లాడుతూ.. ఇంతకుముందు కూడా నేను మా ఇసి మెంబర్‌గా పనిచేశా. సమావేశాలు జరిగినప్పుడు చాలా గొడవలు జరిగాయి. నరేశ్‌గారిని పనిచేయనీయడం లేదని ఆయన చెప్పారు. మేం కేవలం ఈసీ మెంబర్స్. ఆయన చేసే పనులను మేము ఎక్కడ అడ్డుకుంటాం. అందుకే రాజీనామా చేస్తున్నా. రేపు సమావేశాలు జరిగినప్పుడు ధైర్యం నా వాణి వినిపించలేను“ అని తనీశ్ పేర్కొన్నారు.
ఉత్తేజ్ మాట్లాడుతూ.. “నాపై నమ్మకంతో ‘మా’ సభ్యులు నాకు ఓటేసి గెలిపించారు. వారందరికీ ధన్యవాదాలు.. సినిమాను అమితంగా ప్రేమించే ప్రకాశ్‌రాజ్ ‘మా’ కోసం ఏదైనా చేయాలని వస్తే, కొన్నేళ్లు పనిచేస్తున్న మేమంతా ఆయన కలిసి వచ్చాం. నా 25ఏళ్ల కెరీర్‌లో బెనర్జీ అన్న ఏడవటం చూడలేదు.“ అని ఉత్తేజ్ అన్నారు.