12న హైవేల దిగ్బంధం.. 14న దేశవ్యాప్త ఆందోళన
రైతు సంఘాల నిర్ణయం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలు తాము ముక్త కంఠంతో తిరస్కరిస్తున్నట్లు రైతు సంఘాలు స్పష్టం చేశాయి. చట్టాలను రద్దు చేసే యోచన లేదని, సవరణలకు సంబంధించిన కొన్ని ప్రతిపాధనలను కేంద్రం పంపిన నేపథ్యంలో రైతు సంఘాలు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్నదే తమ ప్రధాన డిమాండ్ అని పునరుద్ఘటించాయి. రైతులు ఆందోళన విరమించేందుకు ఒప్పుకుంటే ప్రస్తుత వ్యవసాయ చట్టాల్లో 8 సవరణలు చేస్తామంటూ కేంద్ర సర్కారు పంపిన ప్రతిపాదనలను తిరస్కరించిన అనంతరం.. రైతులు సంఘాల నేతలు ఆందోళనను మరింత ఉధృతం చేసే విషయమై చర్చించారు. ఆ మేరకు ఆందోళనను ఉధృతం చేసే దిశగా పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అందులో భాగంగా ఈ నెల 12న ఢిల్లీ-జైపూర్, ఢిల్లీ-ఆగ్రా రహదారులను దిగ్బందించాలని రైతులకు రైతు సంఘాల నేతలు పిలుపునిచ్చారు. అదేవిధంగా ఈ నెల 14న దేశవ్యాప్త ఆందోళనలు చేపడతామని వెల్లడించారు. రహదారుల దిగ్బంధనం కోసం దేశంలోని వివిధ ప్రాంతాల రైతులు ఢిల్లీకి తరలిరావాలని రైతు సంఘాల నేతలు కోరారు.