2 మిలియన్ దాటిన రికవరీ
న్యూఢిల్లీ: కరోనా ప్రపంచదేశాలను గడగడలాడిస్తోంది. భారత్‌లాంటి భారీ జనాభాగలిగి దేశం కూడా కరోనా మహమ్మారితో పోరాడుతోంది. కేసుల సంఖ్య రోజురోజకి పెరుగుతున్నాగానీ గుడ్డిలో మెల్లలా రికవరీ రేటు 73.64 శాతానికి చేరడం సానుకూల అంశంగా ఉంది. దేశంలో బుధవారం కొత్తగా 64, 531 మంది కోవిడ్ బారిన పడగా.. కరోనా బాధితుల సంఖ్య 27, 67,273కు చేరుకుంది. గడిచిన 24 గంటల్లో 1092 మంది కరోనా బారిన పడి మృతి చెందగా.. భారత్‌లో కోవిడ్ మరణాల సంఖ్య 52,889గా నమోదైంది. ఇక మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జైన వారి సంఖ్య 20 లక్షలు దాటింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా రాజాస్తాన్‌లో కొత్తగా 699 కోవిడ్ కేసులు వెలుగుచూడగా… 10 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 64,476కు చేరుకుంది. ప్రస్తుతం అక్కడ 14,684 యాక్టివ్ కేసులు ఉన్నాయని రాష్ట్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే
హిమాచల్‌ప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4253కు చేరుకుంది. ప్రస్తుతం 1253 యాక్టివ్ కేసులు ఉన్నాయి. డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 2941.
అమెరికా మరో 100 వెంటిలేటర్ల సాయం
కోవిడ్ పోరులో భాగంగా భారత్‌కు సాయం కొనసాగుతోంది. ఆది నుంచి రెండు దేశాలు పరస్పరం సాయం చేసుకుంటున్నాయి. కరోనా విజృంభిస్తున్న కొత్తలో హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను భారీ ఎత్తున అమెరికాక సరఫరా చేసిన విషయం తెలిసింది. ఇదే క్రమంలో అమెరికా మరో 100 వెంటిలేటర్లను సరఫరా చేసింది. ఈ మేరకు భారత్‌లో ఉన్న అమెరికా రాయబార కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది.