2021 ఎస్ఐ పేపర్‌లీక్ వ్యవహారం.. ఐదుగురు ట్రైనీ ఎస్ఐలు అరెస్ట్

జైపుర్ (CLiC2NEWS): 2021 ఎస్ఐ నియామక పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఐదుగురు ట్రైనీ ఎస్ ఐలు అరెస్టయ్యారు. వీరిలో ఒకరు మహిళ కూడా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. వీరిలో ఇద్దరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడి పిల్లలు కావడం గమనార్హం. రాజస్థాన్ సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ పరీక్ష -2021 ప్రశ్నాపత్రం లీకేజి కేసుపై స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్ఒజి) విచారణ జరుపుతోంది. అరెస్టయిన వారిలో శోభా రైకా, అమె సోదరుడు దేవేశ్ రైమా, మంజు దేవి, అవినాశ్ పల్సానియా, విజేంద్ర కుమార్‌గా గుర్తించారు. శిక్షణలో ఉన్న ఈ ఐదుగురినీ రాజస్థాన్ పోలీస్ అకాడమీలో అదుపులోకి తీసుకొని ఎస్ఒజి కార్యాలయానికి తరలించారు.
ఈ కేసులో మొత్తం 61 మంది నిందుతులపై పోలీసులు మూడు ఛార్జిషీట్‌లు దాఖలు చేయగా.. వారిలో 33 మంది ట్రైనీ సబ్-ఇన్‌స్టెక్టర్లు ఉన్నారు. ఎంపికైగా సర్వీసులో చేరనివారు నలుగురు, మిగతా 24 మంది పేపర్ లీక్ ముఠాతో సంబంధం కలిగి ఉన్నట్లు సమాచారం.