22 ఎక్స్‌ప్రెస్ రైళ్ల పునరుద్ధరణ

సికింద్రాబాద్: గత ఏడాది మార్చిలో కరోనా లాక్డౌన్ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) మొత్తం 300 రైళ్లను రద్దు చేసింది. కాగా కేంద్రం అన్‌లాక్ తర్వాత దశలవారీగా పునరుద్ధరిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే 180 రైళ్లు నడుస్తున్నాయి. వీటికి అదనంగా మరో 22 ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా పునరుద్ధరించాలని ఎస్సీఆర్ జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా నిర్ణయించారు. అయితే కొత్తగా పునరుద్ధరించే రైళ్లు ఏప్రిల్ 1 నుంచి మార్గాలవారీగా ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆయన బుధవారం అధికారికంగా ప్రకటించారు. మిగిలిన ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా దశలవారీగా ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. అయితే ప్యాసింజర్ రైళ్ల రాకపోకలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపారు.
ప్రయాణికులంతా కరోనా నిబంధనలు పాటించడానికి రిజర్వేషన్ విధానాన్ని అమలుచేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. కనీసం 4 గంటల ముందుగానే టికెట్ బుక్ చేసుకోవాలి. మూడు నెలల ముందు నుంచే రిజర్వేషన్‌కు అవకాశం ఉన్నది. జనరల్ టికెట్ కూడా రిజర్వేషన్ ఉండటంతో సాధారణ టికెట్ ధరపై రూ.15 అదనంగా చెల్లించాలి.