Nirmal: నర్సాపూర్‌లో 245 మి.మీ. వర్షపాతం
![](https://clic2news.com/wp-content/uploads/2021/07/nirmal-Rain-750x313.jpg)
నిర్మల్ (CLiC2NEWS): తెలంగాణ రాష్ట్రం అంతటా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుండటంతో స్వర్ణ, కడెం, భైంసా గడ్డెన్నవాగు ప్రాజెక్టుల్లోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో అధికారులు ప్రాజెక్టు రెండు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు.
గడిచిన 24 గంటల్లో నిర్మల్ జిల్లాలో వాన దంచికొట్టింది. జిల్లాలోని నర్సాపూర్‌లో అత్యధికంగా 245 మి.మీ. వర్షపాతం నమోదైంది. రాష్ట్ర వ్యాప్తంగా 44.2 మి.మీ. వర్షపాతం నమోదయింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లో అత్యధికంగా 115.5 మి.మీ. వర్షపాతం నమోదైంది.
కేవలం నిర్మల్ జిల్లాలోనే 204 మి.మీ. వర్షపాతం నమోదైంది.
భైంసా పట్టణంలోని ఆటోనగర్‌లోని ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. ఆటోనగర్. ఎన్.ఆర్. గార్డెన్ ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వరద నీటిలో చిక్కుకున్న 150 మందిని అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎన్.ఆర్. గార్డెన్ లో బస చేసిన 20 మంది పోలీసులు వరద నీటిలో చిక్కుకుపోవడంతో బోట్ల సాయం వారిని రక్షించారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు, ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. నిర్మల్ పట్టణంలోని మంజూలాపూర్, మంచిర్యాల చౌరస్తా, సిద్దాపూర్, సోఫీ నగర్ కాలనీలను మంత్రి పరిశీలించారు. సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.