హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులు: కేబినెట్ నిర్ణయం

హైదరాబాద్(CLiC2NEWS): రాజధాని నగరంలో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణానికి తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణాలు వేగంగా చెప్పట్టాలని సంబంధిత శాఖ ఉన్నతాధికారులను కేబినెట్ ఆదేశించింది. ముఖ్యమంత్రి కెసిఆర్ అధ్యక్షతన గురువారం రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
హైదరాబాద్‌లో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం, వచ్చే ఏడాది నుంచి కొత్త వైద్య కళాశాలలు, పోడు భూములపై ఉపసంఘం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలున్నాయి. ఈ భేటీలోనే శాసనసభ సమావేశాల నిర్వహణపై చర్చించి తేదీలు ఖరారు చేసింది.
వైద్యారోగ్య శాఖపై చర్చ..
రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కొవిడ్ కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకు వచ్చారు. కరోనా పూర్తిగా అదుపులోనే ఉందని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 2.56 కోట్లకు పైగా కొవిడ్ డోసులు పంపిణీ చేసినట్లు వివరించారు. నేటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్టు వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. ప్రత్యేక డ్రైవ్‌ని విజయవంతం చేసేందుకు ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిల్లోని పంచాయతీ మున్సిపల్ అధికారులు, సర్పంచులు సహా ఎంఎల్ఏలు, ఎంఎల్సీలు, ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కేబినెట్ దిశానిర్దేశం చేసింది. మరోవైపు కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుంచి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్ అండ్ బీ, వైద్యారోగ్య శాఖను కేబినెట్ ఆదేశించింది. హైదరాబాద్‌లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణంపై సమీక్షించిన కేబినెట్… అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని… ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని తెలిపింది. దీనిని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులకు స్పష్టం చేసింది. చిన్నపిల్లలకు కరోనా వస్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు కేబినెట్‌కు వివరించారు. రూ. 133 కోట్ల ఖర్చుతో పడకలు, మందులు, ఇతర సామగ్రిని, చిన్నపిల్లల వైద్యం కోసం సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు. రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కోసం సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రి మండలి వైద్యశాఖాధికారులను ఆదేశించారు.
హోంశాఖపై చర్చ
హోంశాఖపై మంత్రివర్గ సమావేశంలో చర్చించారు. కొత్త జిల్లాల్లోని పీఎస్‌ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహమూద్ అలీ నేతృత్వంలో ఉపసంఘం ఏర్పాటు చేశారు. దీనిలో సభ్యులుగా హరీశ్‌రావు, జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ఇంద్రకరణ్‌రెడ్డి, సబిత, పువ్వాడ అజయ్‌ను నియమించారు.
వ్యవసాయశాఖ, పౌరసరఫరాలపై…
వ్యవసాయశాఖ, పౌరసరఫరాలశాఖపై కేబినెట్లో ప్రస్తావించారు. వర్షపాతం వివరాలు, వానాకాలంలో సాగు వివరాలపై కేబినెట్లో చర్చించారు. అలాగే పోడు భూముల సమస్యపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఛైర్‌పర్సన్‌గా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు కాగా… సభ్యులుగా మంత్రులు జగదీశ్‌రెడ్డి, పువ్వాడ అజయ్, ఇంద్రకరణ్‌రెడ్డిని నియమించారు.
24 నుంచి అసెంబ్లీ, మండలి సమావేశాలు…
ఈ నెల 24 నుంచి శాసన సభ, మండలి సమావేశాలు నిర్వహించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ఈ మేరకు సమావేశాల నిర్వహణకు కేబినెట్ ఆమోదం తెలిపింది.