ఇండోనేషియాలో భూకంపం సంభవించి 56 మంది మృతి..!

జకర్తా (CLiC2NEWS): ఇండోనేషియాలోని పశ్చిమ జావాలోని సియాంజుర్‌లో భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.6 తీవ్రతగా నమోదైంది. సియాంజుర్ ప్రాంతం ఇండోనేషియా రాజధాని జకర్తాకు 75 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు దాదాపు 56 మంది మృతి చెందగా.. 700 మందికిపైగా గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. ఇళ్లు, కార్యాలయాలు, ఇతర నిర్మాణాలు సైతం నేలకొరిగాయి. శిథిలాలకింద చిక్కుకుని అనేకమంది మృత్యువాతపడ్డారు. భూకంపం తర్వాత కూడా ఆప్రాంతంలో 25 వరకు ప్రకంపనలు నమోదయ్యాయని తెలిపారు. దీని కారణంగా ప్రజలంతా బయటనే ఉండాలని ప్రభుత్వ వాతావరణ, జియోఫిజిక్స్ సంస్థ, బిఎంకెజి వెల్లడించింది.