వికారాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

వికారాబాద్‌: వికారాబాద్‌ జిల్లా మెమిన్‌పేట‌లో శ‌నివారం ఉద‌యం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మోమిన్‌పేట మండలం ఇజ్రాచిట్టంపల్లి గేటు వద్ద ఆగివున్న ఆటోను ఎదురెదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు, లారీ ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటోలో ఉన్న నలుగురు అక్కడిక్కడే మరణించారు. మరో ఐదుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహకారంతో క్షతగాత్రులను సంగారెడ్డి దవాఖానకు తరలించగా.. మరొకరు మృతిచెందారు. గాయపడినవారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నదని తెలిపారు. మృతులంతా కూలీలుగా గుర్తించారు. వీరిలో నలుగురు మహిళలు ఉన్నారు.


మండలంలోని శంకర్‌పల్లి వద్ద పత్తి తీసేందుకు చిట్టంపల్లి నుంచి ఆటోలో వెళ్తున్నారు. అయితే మరికొంత మంది కూలీల కోసం ఇజ్రా చిట్టంపల్లి గేట్ వద్ద ఆటో ఆగింది. ఈ క్రమంలో సంగారెడ్డి నుంచి తాండూరు వైపు లారీ వెళ్తుండగా, తాండూరు నుంచి సంగారెడ్డి వైపు ఆర్టీసీ బస్సు వస్తూ.. ఆగి ఉన్న ఆటోను ఒకేసారి ఢీకొట్టాయి. దీంతో ఆటో నుజ్జునుజ్జు అయ్యింది. బస్సును ఢీకొన్న లారీ బోల్తా పడింది. పొగమంచు కారణంగా ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. మృతులు సోన బాయి (15), సంధ్య (18), నితిన్ (15), శేణీ బాయి (55), రేణుకగా గుర్తించారు.

 

Leave A Reply

Your email address will not be published.