ఈ నెలాఖ‌రులోగా ఉద్యోగుల‌ ప‌దోన్న‌తులు పూర్తి చేయాలి : సీఎస్

హైద‌రాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో అన్ని స్థాయిల ఉద్యోగుల ప‌దోన్న‌తుల‌ను ఈ నెలాఖ‌రులోగా పూర్తి చేయాల‌ని సిఎస్ సోమేశ్ కుమార్ అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్ల‌ను ఆదేశించారు. మంగళవారం బీఆర్‌కేఆర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫ‌రెన్స్‌ను నిర్వ‌హించారు. ఈ స‌మీక్షా స‌మావేశంలో అన్ని క్యాటగిరీలలో పనిచేస్తున్న ఉద్యోగుల ప‌దోన్న‌తులు, డీపీసీలు నిర్వహణ, కారుణ్య నియామకాలు, రెవెన్యూ సంబంధిత అంశాలు, రైతు వేదికలు, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, సెగ్రిగేషన్ షెడ్స్, డ్రైయింగ్ ఫ్లాట్ ఫామ్స్, గ్రామ నర్సరీలు, ఉపాధిహామీ పనులు తదితర అంశాలపై సీఎస్ చ‌ర్చించారు.
ఈ స‌మావేశంలో ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు, జీఏడీ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్‌, రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ, సీఐజీ, సీఎం కార్యదర్శి శేషాద్రి, సీనియర్ కన్సల్టెంట్ శివశంకర్, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ కమిషనర్ రఘునందన్‌రావు, ఎండీ, టీఎస్ టీఎస్ జి.టి. వెంకటేశ్వర్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ లేని విధంగా ఉపాధిహామీ ద్వారా ఈ సీజన్‌లో మూడు నెలల ముందుగానే 14.10 కోట్ల పని దినాలు దాటినందుకు అధికారులను అభినందిస్తూ వచ్చే 3 నెలల కోసం ప్రణాళికలు రూపొందించుకోవాలని ఆదేశించారు. రైతు వేదికలు, పల్లెప్రకృతి వనాలు, వైకుంఠదామాలు, డ్రైన్ ప్లాట్ ఫామ్స్, సెగ్రిగేషన్ షెడ్స్, నర్సరీలలో ప్లాంటేషన్ తదితర అంశాలకు ప్రాధాన్యత నిచ్చి పూర్తి చేయాలన్నారు.

అలాగే ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేయాలని సీఎం కె.చంద్రశేఖర్ రావు ఆదేశించారని కలెక్టర్లకు తెలిపారు. జిల్లా కలెక్టర్లు ఈ అంశంపై వెంటనే జిల్లా స్ధాయిలో సమావేశం నిర్వహించి ప్రమోషన్ల ద్వారా నింపే ఉద్యోగ ఖాళీల సంఖ్యను అంచనా వేయాలన్నారు. ప్రతి సోమవారం ప్రమోషన్ల, కారుణ్య నియామాకాలపై సమావేశాలు నిర్వహించి ఈ నెల 24 నాటికి పూర్తి చేయాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.