టివి, ఫ్రిజ్‌ ఉంటే.. రేషన్‌కార్డు వ‌దులుకోండి!

బెంగళూరు: పేద ప్ర‌జ‌ల‌కు ఇచ్చిన రేష‌న్ కార్డుపై కీల‌క నిర్ణ‌యం తీసుకుంది క‌ర్ణాట‌క స‌ర్కార్‌. టివి, ఫ్రిజ్‌, ద్విచ‌క్ర‌వాహ‌నం లాంటి వ‌స్తువులు ఉన్న‌వారు రేష‌న్ కార్డు వ‌దులుకోవాల‌ని లేదంటే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని హెచ్చ‌రించింది. బీపీఎల్‌ కార్డుల మంజూరు విషయంలో ఇకపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించదని ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖమంత్రి ఉమేష్‌ కత్తి స్పష్టం చేశారు. సోమవారం బెళగావిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు. ఉన్నత వర్గాలకు చెందిన వారు కూడా ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే రేషన్‌ సరుకులను ఉపయోగించుకున్నారని, దీని ద్వారా వెనుకబడిన వారికి సరుకులు చేరడంలేదని పేర్కొన్నారు.

1.20 లక్షల వార్షిక ఆదాయం కంటే వక్కువ ఉన్నవారు ఉచిత రేషన్ ఉప‌యోగించ‌కూడ‌దు అని ఉమేష్ వెల్ల‌డించారు. అలాగే టీవీ, ఫ్రిజ్‌, ద్విచక్ర వాహనం ఉంటే రేషన్‌ కార్డును వెంటనే వదులుకోవాలన్నారు. మార్చి 31 వరకు కార్డును వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించారు. లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మంత్రి ఉమేష్‌ కత్తి హెచ్చరించారు.

అయితే మంత్రి వ్యాఖ్య‌ల‌ను ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప‌లు రేష‌న్ దుకాణాల ఎదుట పార్టీ కార్య‌కర్త‌లు ఆందోళ‌న చేప‌ట్టారు.

Leave A Reply

Your email address will not be published.