శ్రీశైల మల్లన్నకు శ్రీవారి తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన టీటీడీ ఈవో

తిరుమల: శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి తరపున టీటీడీ ఈవో డాక్టర్ కె ఎస్ జవహర్ రెడ్డి దంపతులు ఆదివారం సాయంత్రం పట్టువస్త్రాలు సమర్పించారు.
శ్రీశైలంలో జరిగే శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ తరపున పట్టువస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులోభాగంగా ఈవో దంపతులు ఆదివారం పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయం వద్దకు చేరుకున్న ఈవో దంపతులకు ఎమ్మెల్యే శ్రీ శిల్ప చక్రపాణి రెడ్డి, ఆలయ ఏఈవో శ్రీ హరిదాసుతో పాటు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. పట్టువస్త్రాల సమర్పణ అనంతరం ఈవో దంపతులతో పాటు తిరుమల ఆలయ ఓఎస్డీ పాల శేషాద్రి, టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వీరికి తీర్థ, ప్రసాదాలు అందించారు. రాత్రి జరిగిన మల్లిఖార్జున స్వామి మయూర వాహన సేవలో వీరు పాల్గొన్నారు.